ప్రసన్నంకోసం
పరంధాముడు
ప్రసన్నం కావాలని —
పూజా పునస్కారాలు చేస్తా,
ప్రసాద తాంబూలాలు పంచుతా.
ప్రియురాలు
ప్రసన్నం కావాలని —
పొంకపు చూపులు విసురుతా,
పకపకల నవ్వులు చిందుతా.
అధికారులు
ప్రసన్నం కావాలని —
దండాలు పెడతా, ధనమాశ చూపుతా;
బహుమతులు ఇస్తా, బ్రతిమాలుకుంటా.
ప్రకృతి
ప్రసన్నం కావాలని —
పలురీతుల పసందుగా వర్ణిస్తా,
పరికింపజేసి పరవశపరుస్తా.
పలుకులమ్మ
ప్రసన్నం కావాలని —
ప్రణామాలు చేస్తా,
ప్రతినిత్యం ప్రార్థిస్తా.
అక్షరాలు
ప్రసన్నం కావాలని —
వెదికివెదికి పట్టుకుంటా,
ముత్యాల సరాల్లా కూరుస్తా.
పదాలు
ప్రసన్నం కావాలని —
పువ్వుల్లా గుచ్చుతా,
ప్రాసల్లో పొసుగుతా.
పాఠకులు
ప్రసన్నం కావాలని —
తనువులు తట్టుతా,
మనసులు ముట్టుతా.
సాహిత్యలోకము
ప్రసన్నం కావాలని —
అక్షరజ్యోతుల్లో వెలుగుతా,
పతకమాలలతో కులుకుతా.
అంతరంగాలు
ప్రసన్నం కావాలని —
మాటల మల్లెలు విసురుతా,
మదులను మత్తులో ముంచుతా.
పొరుగువారు
ప్రసన్నం కావాలని —
పలుకులకు తేనియను పూస్తా,
పెదాలకు అమృతం అందిస్తా.
ప్రపంచము
ప్రసన్నం కావాలని —
కవితా గానము ఆలపిస్తా,
అంతరంగ సాక్షిగా నిలుస్తా.
ప్రసన్నమే నా రక్తి
ప్రసన్నతే నా శక్తి
ప్రసన్నమే నా యుక్తి
ప్రసన్నతే నా ముక్తి
ప్రసన్నమే నా ధ్యేయం
ప్రసన్నతే నా ప్రాణం
ప్రసన్నమే నా కవిత్వం,
ప్రసన్నతే నా జీవితస్వరూపం.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment