గగనయానం — కవనవిహారం గగనానికి ఎగిరితిని — గాలిపటంలా గాలిలో తేలుతూ మేఘాల మడుల్లో మునిగిపోతూ మనసుకు మధురిమలు పంచితిని. మబ్బులపై కూర్చొంటిని — మౌనాన్ని ముత్యాల్లా పేర్చుకుంటూ ఆలోచనల అలల్ని ఆడించుకుంటూ అంతరంగాన్ని ఆలకించితిని. చంద్రునిపై కాలుమోపితిని — చల్లని వెన్నెల నవ్వుల్లో నిశ్శబ్ద గీతాల సవ్వడితో నిత్యానందం నింపుకుంటిని. భూగోళాన్ని తిలకించితిని — బొమ్మలా తిరిగే జీవన చక్రాన్ని సుఖదుఃఖాల సుడిగుండాల్లో సత్యాల సవ్వడిని అనుభవించితిని. ప్రపంచాన్ని పరికించితిని — ప్రతి హృదయంలో ఒక విశ్వం ఉందని ప్రతి చూపులో ఒక గాథ ఉందని ప్రేమే పరమార్థమని తెలుసుకుంటిని. నక్షత్రాలను ఏరుకొంటిని — నవనీతపు నెమలిపింఛాల్లా చేర్చుకుంటూ కలల కిరీటం కట్టుకుని కాంతుల కవితల్ని కూర్చితిని. ఇంద్రధనస్సుపై కూర్చొని — ఏడు రంగుల రాగాలతో భావాల బాణీలు పలికిస్తూ పాఠక హృదయాల్లో పరిమళించితిని. గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.