నా రాతపూతలు
ఏకాంతంగా కూర్చుంటా
ఏదయినా రాసుకుంటా
తలపులను పారిస్తుంటా
తోచినపనులు చేసుకుంటా
తళుకులతారకలు చూస్తా
తేలియాడేమబ్బులు తిలకిస్తా
తచ్చాడేజాబిలిని గమనిస్తా
తనివితాకే వెన్నెలనాస్వాదిస్తా
కడలితీరంలో కూర్చుంటా
ఎగిసిపడేకెరటాలను కంటా
తెల్లనినురుగులు వీక్షిస్తా
చల్లనిగాలిని పీల్చుకుంటా
అక్షరాలను ఏరుకుంటా
పదాలను పేర్చుకుంటా
కవితలను కూర్చుతుంటా
కమ్మదనాలు కూరుస్తుంటా
హృదులను ముట్టుతా
మదులను దోస్తా
గుండెలను తాకుతా
సాహితిని ఆహ్వానిస్తా
పగటికలలు కంటా
కవ్వింపులకు గురవుతా
కల్పనలు కావిస్తా
భ్రమలందు ముంచేస్తా
కవనపుష్పాలు చల్లుతా
సుమసౌరభాలు చిమ్ముతా
అందాలు చూపించుతా
ఆనందాలు పంచుతా
ఆకాశానికి ఎగిరిస్తా
పర్వతాలు ప్రాకిస్తా
లోయల్లోకి దించుతా
ప్రకృతిని పరికింపజేస్తా
సమాజవేదనలు వింటా
విసుర్లబాణాలు వదులుతా
పేదలపాట్లను తలుస్తా
పద్యాలు వ్రాసిపాడిస్తా
సత్యాన్ని నిలబెడతా
న్యాయాన్ని కాపాడుతా
ప్రేమానురాగాలు కురిపిస్తా
మానవత్వమును చూపిస్తా
జననికన్నీళ్ళు తుడుస్తా
భూమాతగాయాలు మానిపిస్తా
స్వాతంత్రజ్యోతులు వెలిగిస్తా
పౌరులభవితను పరిరక్షిస్తా
వాస్తవాలను ముందుంచుతా
నిదిరించేవారిని మేలుకొలుపుతా
సాహిత్యకిరణాలు విరజిమ్ముతా
కవనప్రియులను కుతూహలపరుస్తా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment