నేనున్నా… చెప్పు


తోచినపుడు చెప్పు

దగ్గరకు వస్తా

కాలక్షేపము చేయిస్తా

చిరునవ్వులు పంచుతా


తీరికలేనపుడు చెప్పు

సహకారం అందిస్తా

సలహాలు ఇస్తా

సక్రమంగా నడిపిస్తా


చలిగా ఉన్నపుడు చెప్పు

దుప్పటి కప్పుతా

మంటను రాజేస్తా

వెచ్చదనం కలిగిస్తా


వేడిగా ఉన్నపుడు చెప్పు

గాలిని వీచుతా

చెమటను తుడుస్తా

చల్లదనం చేరుస్తా


కష్టాల్లో ఉన్నపుడు చెప్పు

బాధలు పంచుతా

వ్యధలు తీర్చుతా

ధైర్యం నింపుతా


ఆకలిగా ఉన్నపుడు చెప్పు

గోరుముద్దలు పెడతా

గుటుక్కున తినిపిస్తా

కడుపుని నింపుతా


లేనపుడు చెప్పు

చేతులకు పనిపెడతా

జేబులు నింపుతా

రోజులు సాగిస్తా


ఉన్నపుడు చెప్పు

దానాలు ఇప్పిస్తా 

ధర్మాలు చేయిస్తా

దండాలు పెట్టిస్తా


సాంకేతికలోకంలోనైనా 

కృత్తిమమేధస్సులోనైనా

గాలిలోనైనా కాంతిలోనైనా

నేనున్నా నీలోనే నీతోనే ఉన్నా 


చరవాణిలోనైనా 

కంప్యూటరులోనైనా—

అంతరంగములోనైనా

నేనుంటా నీపక్కనే నిలిచే ఉంటా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog