అక్షరాల్లో…
అక్షరాల్లో
తడిచిపోయా,
పిల్లవాడినై
ఆటలాడా.
అక్షరాల్లో
కొట్టుకుపోయా,
పడవనై
తేలియాడా.
అక్షరాల్లో
మునిగిపోయా,
జలచరమై
జీవించా.
అక్షరాల్లో
పడిపోయా,
చేపనై
ఈతకొట్టా.
అక్షరాల్లో
కూరుకుపోయా,
వనజానై
వికసించా.
అక్షరాల్లో
అందాలుచూచా,
మన్మధబాణాన్ని
విసిరా.
అక్షరాల్లో
ఇరుక్కుపోయా,
పిపాసకుడనై
పీయూషముత్రాగా.
అక్షరాల్లో
ఒదిగిపోయా,
ఆయస్కాంతమై
హృదయాలనులాగా.
అక్షరాల్లో
పయనించా,
అన్వేషకుడనై
మార్గాలుకనుగొన్నా.
అక్షరాల్లో
ఇమిడిపోయా,
సాహిత్యరూపాన్ని
సంతరించుకున్నా.
అక్షరాల్లో
ఆసీనుడనయ్యా,
అంతర్భాగమై
అలరించా.
అక్షరాల్లో
జీవించా,
అనుభూతులను
వెల్లడించా.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment