అక్షరాల ఆటలు
అక్షరాల ఉనికిని ఉజ్జ్వలింపచేయనా,
మహిమల చిట్టాని ముందుంచనా.
అక్షరాల తోటలో త్రిప్పించనా,
వేటలో దింపి విజృంభింపజేయనా.
అక్షరాల పువ్వులుచల్లి పరిమళింపజేయనా,
నీటిచుక్కలు చుట్టూచల్లి చల్లపరచనా.
అక్షరాల వెలుగులు విరజిమ్మనా,
వెన్నెల జల్లులు కురిపించనా.
అక్షరాల ముత్యాలుగుచ్చి పొదగనా,
రత్నాల హారాలు మెడనవేయనా.
అక్షరాల అర్ధాలు అర్చించనా,
భావాల తరంగాలు వదలనా.
అక్షరాల అందాలు వర్ణించనా,
ఆనందాల ధారలు పారించనా.
అక్షరాల సౌరభాలు చిలకరింపనా,
రంగుల రమ్యాలు చూపించనా.
అక్షరాల విన్యాసం చేయించనా,
పాటల సరస్వతిని పాడింపజేయనా.
అక్షరాల ఆటలతో అలరింపనా,
మాటల మాధుర్యాలతో మురిపించనా.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment