ఆమె ఙ్ఞాపకాలు
ఆమె చిరునవ్వులను
నాదగ్గర వదిలివెళ్ళింది
ఎక్కడకు పోయిందో?
ఏమిపనులు చేస్తుందో?
ఆమె తేనెపలుకులను
నాదగ్గర కుమ్మరించిపోయింది
బాకీ ఎలా తీర్చుకుంటానో?
వడ్డీ ఎపుడు చెల్లించుకుంటానో?
ఆమె సుమసౌరభాలను
నాపై చల్లివెడలింది
ఎన్నిరోజులు అనుభవిస్తానో?
ఎంతకాలం సుఖపడతానో?
ఆమె అందచందాలను
నాకప్పగించి కనుమరుగయ్యింది
కలలోకి ఎందుకొస్తుందో?
కవ్వించి ఏమిసాధిస్తుందో?
ఆమె ముద్రను
నామనసుపై అంటిదూరమయ్యింది
ఆగుర్తు ఎందుకు చెడటంలేదో?
ఆతలపులు ఎందుకు వీడటంలేదో?
ఆమె ఙ్ఞాపకాలను
నామెదడుకెక్కించి అదృశ్యమయ్యింది
నిత్యం నెమరేసుకుంటున్నా ఎందుకో?
క్షణక్షణం కుమిలిపోతున్నా ఎందుకో?
ఆమె చిలిపితనమును
నామీద కురిపించిపోయింది
ఎక్కడ దాక్కున్నదో?
ఏమిపాట్లు పడుతున్నదో?
ఆమె శీలసంపదను
నాకందించి మాయమయ్యింది
ఎన్నిబాధలు పడుతుందో?
ఎంతగా కృశించిపోయిందో?
ఆమె ఙ్ఞాపకాలను
సదా స్మరించుకుంటా!
ఆమె అనుభూతులను
రోజూ తలచుకుంటా!
ఆమె వస్తే అంతా అప్పగిస్తా!
ఆమె కోరితే అండగా నిలుస్తా!
అసలు తిరిగి చెంతకు వస్తుందా!
అలనాటి సుఖాలను మళ్ళీ ఇస్తుందా!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments
Post a Comment