ఆత్మావలోకనం
ఆలోచించటం నేర్చుకున్నా,
నిర్ణయాలు తీసుకోవటం చేతకాకున్నది.
కాంక్షల విత్తనాలు నాటుతున్నా,
సాధన పంటలు పండకున్నవి.
అందాల ఊసులు ఊహించుకున్నా,
అనుభవాలు అందక దూరమైపోయాయి.
ఆనందాలు అందుకోవాలని తపిస్తున్నా,
చేతులలో నిలువక జారిపోతున్నాయి.
మిఠాయిల రుచులు కోరుకున్నా,
నోటికి తగలని జ్ఞాపకాలయ్యాయి.
పరిమళాలు పీల్చి పరవశించాలనుకున్నా,
గాలిలో కలసి మాయమైపోయాయి.
పనులు చేయటం చేస్తున్నా,
మనసుకు నచ్చని చేష్టలైపోయాయి.
నడవటం సాగిస్తున్నా,
గమ్యాలు చేరని దారులైపోయాయి.
ఎట్లా సమయం గడపను?
ఎలా జీవనాన్ని నెట్టుకురాను?
ఏ మార్గాన నడచెదను?
ఏ కార్యములు సాధించెదను?
కానీ రేపో మాపో -
ఒక వెలుగు దారిని చూపదా
ఒక ఆశ హృదయాన్ని నింపదా
ఒక అడుగు ముందుకు వేయించదా
ఒక జీవిత లక్ష్యము నెరవేరదా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment