దొరకకపోతే?
పల్సు దొరకకపోతే
జీవితం గాలిలో కలిసిపోతుంది,
పర్సు దొరకకపోతే
హృదయం దుఃఖానికి తావవుతుంది.
పని దొరకకపోతే
చేతులు నిశ్చలమవుతాయి,
తిండి దొరకకపోతే
కడుపులు మంటలపాలవుతాయి.
మాటలు దొరకకపోతే
నిశ్శబ్దం రాజ్యమేలుతుంది,
తోడు దొరకకపోతే
జీవితము ఏకాంతమవుతుంది.
ప్రేయసి దొరకకపోతే
బ్రతుకు బ్రహ్మచర్యమవుతుంది
ప్రేమ దొరకకపోతే
జీవితం శూన్యగ్రంధమవుతుంది.
బండి దొరకకపోతే
కాళ్ళు చక్రాలవుతాయి,
సమయం దొరకకపోతే
వాయిదా అనివార్యమవుతుంది.
అందం దొరకకపోతే
కళ్ళు కళాహీనమవుతాయి,
ఆనందం దొరకకపోతే
ఒళ్ళు నిరాశజనకమవుతుంది.
ఫలితం దొరకకపోతే
ప్రతిక్షణం దండగవుతుంది
జీవితం దొరకకపోతే,
అస్తిత్వం శూన్యమవుతుంది
అర్ధం దొరకకపోతే
కవనం వ్యర్ధప్రదమవుతుంది,
ఆంతర్యం దొరకకపోతే
కూర్చటం వృధాప్రయాసవుతుంది.
అక్షరాలు దొరకకపోతే
కలం మూగవాద్యమవుతుంది,
పదాలు దొరకకపోతే
కాగితం ఖాళీ ఆకాశమవుతుంది.
కవులు దొరకకపోతే
కవిత్వం నిర్జలనదీప్రవాహమవుతుంది,
పాఠకులు దొరకకపోతే
ప్రోత్సాహం సదాపూజ్యమవుతుంది
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment