పొద్దున్నే...
సాహితి కవ్విస్తుంటే
కలలు కంటున్నా
రాగాలు తీస్తున్నా
కల్పనలు చేస్తున్నా.
సూర్యోదయం అవుతుంటే
అరుణకిరణాలు వీక్షిస్తున్నా,
జనజాగృతం గమనిస్తున్నా
తెలుగుజ్యోతులు వెలిగిస్తున్నా.
అక్షరాలు కురుస్తుంటే
ఏరుకుంటూ ఆడుతున్నా,
పేర్చుకుంటూ పాడుతున్నా,
కుతూహలం తీర్చుకుంటున్నా.
పదాలు పిలుస్తుంటే
చెంతకు పోతున్నా,
చెలిమి సాగిస్తున్నా
చిత్రరేఖలు గీస్తున్నా.
వాక్యాలు కూడుతుంటే
ప్రాసలగూడు కట్టుతున్నా,
పోలికలమాల వేస్తున్నా
పరిమళాలు వెదజల్లుతున్నా.
ఊహలు ఊరుతుంటే
మెదడులో మ్రోగిస్తున్నా,
హృదయంలో నింపుతున్నా
కవిత్వంలో కనబరుస్తున్నా.
భావాలు బయటకొస్తుంటే
పరికించుతున్నా,
రూపము దిద్దుతున్నా
ప్రతిమను సృష్టిస్తున్నా.
మాటలు పెదాలజారుతుంటే
అమృతం త్రాగిస్తున్నా,
తీయదనం చేరుస్తున్నా
శ్రావ్యతను పంచిపెడుతున్నా.
కవితలు పుట్టుకొస్తుంటే
వెలుగులు చిందుతున్నా,
రంగులు అద్దుతున్నా
హంగులు ప్రదర్శిస్తున్నా.
కవనాలు కూరుతుంటే
అందాలలోకం కనబరుస్తున్నా,
ఆనందరాగం ఆలపిస్తున్నా,
అంతరంగాలను అలరిస్తున్నా.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment