కవిత్వం రాస్తా-రాస్తుంటా!


చూపులు చీల్చినా,

మాటలు మండినా,

విషము చిమ్మినా –

కలాన్ని వదలనూ… వదలనూ!


ఆంక్షలు విధించినా,

ఆటంకాలు సృష్టించినా,

అభ్యంతరాలు వ్యక్తపరచినా –

కాగితాన్ని వీడనూ… వీడనూ!


మట్టిలో కప్పినా,

గాలిలో కలిపినా,

గుంతలో పడేసినా –

రాయటాన్ని ఆపనూ… ఆపనూ!


బురదలో నెట్టినా,

బూడిదలో కుక్కినా,

బాధలలో ముంచినా –

సువాసనలు చల్లుతా… చల్లుతా!


చేతితో చరచినా,

కాలితో తన్నినా,

కర్రతో కొట్టినా –

కవితాజ్యోతులు వెలిగిస్తా… వెలిగిస్తా!


బరువు మోపినా,

పరువు తీసినా,

కరువు వచ్చినా –

సాహిత్యరాగాలు తీస్తా-తీస్తా!


గుండె గాయాలపాలైనా,

హృది తరగిపొయిన,

మది మదనపడ్డా –

కవనం సాగిస్తా… కొనసాగిస్తా!


ఊపిరి ఆగేదాకా,

కాయం కూలేదాకా,

ప్రాణం పోయేదాకా –

కవిత్వం రాస్తా… రాస్తుంటా!


కవనం – 

నా ధ్యేయం,

నా మార్గం, 

నా భాగ్యం.


కవిత్వం – 

నా ప్రాణం,

నా మానం, 

నా జీవనం!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం 

Comments

Popular posts from this blog