సుకవుల సుకృత్యాలు
అక్షరసుమాలు అల్లటం,
పదమాలలు గుచ్చటం,
ఆలోచనలు పారించటం,
భావాలకు రూపమివ్వటం.
పువ్వులు చూపించటం,
పరిమళాలు వెదజల్లటం,
నవ్వులు చిందించటం,
మోములు వెలిగించటం.
అందాలు చిత్రించటం,
ఆనందాలు అందించటం,
అలంకారాలు జోడించటం,
అంతరంగాలు ముట్టటం.
బాటలువేసి నడిపించటం,
రంగులుదిద్ది చూపించటం,
కలంపట్టి పుటలునింఫటం,
హృదయాలను మురిపించటం.
కాంతులుచల్లి చీకట్లుతోలటం,
రవినితలపించి బ్రహ్మను అనుసరించటం,
వాక్యాల్లో విశ్వాన్ని ఆవిష్కరించటం,
వాగ్దేవిని ఆరాధించి ప్రసన్నుడుకావటం.
సాహితీవంటలు వండివడ్డించటం,
కడుపులునింపి తృప్తిపరచటం,
పంటలాగా కవిత్వం పండించటం,
జీవితాల్లో వెలుగులు నింపటం.
భాషను బ్రతికించి జాతిని కాపాడటం,
సాహిత్యసేద్యం సాగించి కైతలు పంచటం,
అమృతంలా కవనధారలు అందించటం,
జాతిగుండెల్లోనిలిచి శాశ్వతస్థానం సంపాదించటం
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment