కవితాజగతిలో…
కవనతీపి చూపటం కాదు,
తినిపించటమే ప్రధానము.
కవితాజల్లులు కురిపించటం కాదు,
పాఠకుల మురిపించటమే ప్రాముఖ్యము.
కయితాగళం ఎత్తటం కాదు,
గానామృతం పంచటమే ధర్మము.
కైతారంగులు చల్లటం కాదు,
హరివిల్లు పొడిపించటమే ముఖ్యము.
అక్షరాలు పేర్చటం కాదు,
ముత్యాలమాల అల్లటమే కవిత్వం.
పదాలు పారించటం కాదు,
ప్రాసలతో పొసగటమే నైపుణ్యం.
కలము పట్టటం కాదు,
విచిత్రాలు చూపటమే కర్తవ్యము.
రాతలు రాయటం కాదు,
కైతలవాసన పంచటమే రమణీయము.
సుదీర్ఘ కవనాలు కాదు,
సంక్షిప్త సందేశాలే శరణ్యము.
వాక్యాలు విసరటం కాదు,
విషయాల విన్నూతనమే శ్రేష్ఠము.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment