ప్రకృతీ ప్రతాపాలు
ఓ ప్రకృతీ రావా!
చిరుగాలివలె పలుకరించవా,
పసినవ్వువలె వెలిగించవా,
హరివిల్లువలె కనిపించవా.
ఓ జాబిల్లీ రావా!
వెన్నెలవలయమై చల్లవా,
నిశీధినకలువవై వికసించవా,
తనివినితాకి తరించవా.
ఓ మేఘమా రావా!
ఆకాశ వీధిలో తేలుతూ,
చినుకుల ముత్యాలు రాల్చుతూ,
తడి పరిమళమై పరచకుంటూ.
ఓ సూర్యుడా రావా!
ఉదయకిరణమై పొడవవా,
మందారమాలికవై మెరవవా,
చీకటిని చిదిమి వెలుగునివ్వవా.
ఓ కోకిలా రావా!
కంఠమున గీతమై పొంగిపొర్లవా,
తేనెల స్రవంతివై జాలువారవా,
మనసున మాధుర్యమై మెప్పించవా.
ఓ కడలి తరంగమా!
ఎత్తుకెగురుతూ క్రిందకు పడుతూ,
నురుగుల జాజిమల్లెలు చిందుతూ,
ఒడ్డును తాకి తిరిగివెళ్ళవా.
ఓ అందమా రావా!
కళలతోరణమై దర్శనమివ్వవా,
పరిమళమై పరిసరాల నిలువవా,
కమ్మదనాల వర్షమై కురవవా.
ఓ ఆనందమా రావా!
చెంతకుచేరి చిరునవ్వులు చిమ్మవా,
చిత్తములో వెలుగులా నిలువవా,
హృదయాన గీతమై వినిపించవా.
ఓ కవితా రావా!
అక్షరాల గజ్జెలు మోగించవా,
పదాల ముత్యాలు మెరిపించవా,
భావాల బహిర్గతము చెయ్యవా.
ఓ కవీ రావా!
కలలని కాంతులుగా అల్లవా,
అనుభూతుల సమూహంగా నిలుపవా,
హృదయంలో ఆరిపోని జ్యోతివికావా.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment