జీవిత పయనంలో
ఈ జీవితం నేర్పిన పాఠాలెన్నో,
ఈ జగతి చూపిన మార్గాలెన్నో ||ఈ||
ఈ జీవిత పయనంలో
తనువుకు తగిలిన గాయాలెన్నో,
ఈ జీవన గమనంలో
గుండెను గుచ్చిన శూలాలెన్నో.
ఈ బ్రతుకు బాటలో
ఎదురైన ఆటంకాలెన్నో,
ఈ ప్రాణ పోరాటంలో
ప్రాప్తించిన అపజయాలెన్నో. ||ఈ||
ఈ బాధ్యతల భారంలో
చేసిన పొరపాట్లెన్నో,
ఈ బరువులు మోయటంలో
భుజాలు పడ్డ పాట్లెన్నో.
ఈ కల్లోల కాలంలో
జరుగుతున్న అక్రమాలెన్నో,
ఈ స్వార్థ ప్రపంచంలో
విచ్ఛిన్నమైన కుటుంబాలెన్నో. ||ఈ||
ఈ సంసారం ఈదటంలో
అనుభవించిన కష్టాలెన్నో,
ఈ సమాజ పోకడల్లో
తెచ్చిన మార్పులెన్నో.
ఈ సంఘ సమరంలో
సహకరించిన స్నేహితులెందరో,
ఈ ప్రజా ఉద్యమాల్లో
ప్రాణాలొడ్డిన వీరులెందరో. ||ఈ||
ఈ అందాల వేటలో
గతించిన కాలమెంతో,
ఈ ఆనందాల వెతుకులాటలో
ఆడిన నాటకాలెన్నో.
ఈ బతుకు తెల్పిన సత్యాలెన్నో,
ఈ మనుగడ చెప్పిన కథనాలెన్నో,
ఈ పుడమి చేసిన సాయాలెన్నో,
ఈ జగము చాటిన హితాలెన్నో. ||ఈ||
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment