ఓ కవితా....నిన్ను


అక్షరాల్లో

కూర్చోబెడతా

పదాల్లో

పండబేడతా


ఆణిముత్యాల్లా

గుచ్చుతా

నవరత్నాల్లా

పేర్చుతా


తీపితెలుగులో

తెలియపరుస్తా

తేటవెలుగులో

తిలకింపజేస్తా


మల్లెపువ్వులా

ప్రదర్శిస్తా

చిరునవ్వులా

వెలిగించుతా


నవవధువులా

కనబరుస్తా

సురమధువులా

మత్తెక్కిస్తా


తేనెచుక్కల్లా

చిందింపజేస్తా

సౌరభంలా

ప్రసరింపజేస్తా


ముద్దూమురిపాల్లో

ముంచుతా

మాయామోహంలో

దించుతా


అమృతంబొట్లు

అందించుతా 

అంతరంగాలు

మురిపించుతా


నాట్యమయూరిలా

పురివిప్పిస్తా

కోయిలగానంలా

కంఠమెత్తిస్తా


పచ్చనిచిలకలా

పలికిస్తా

వయ్యారిహంసలా

నడిపిస్తా


కలంనుండి

జలజలాజాలువారుస్తా

కాగితాలమీద

కళకళాకాంతులుచిమ్మిస్తా


పాఠకలోకానికి

పరిచయంచేస్తా

సాహిత్యజగానికి

సామ్రాఙ్ఞినిచేస్తా


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog