మళ్ళీ మళ్ళీ చెబుతున్నా...గుర్తుంచుకో!
ఊది ఊది
దీపాలను ఆర్పకు
చీకటి అలుముకోవచ్చు
చోరీకి దారితీయవచ్చు!
ఉరిమి ఉరిమి
చిందులు త్రొక్కకు
కోపిష్టివి అనుకోవచ్చు
కొంటెవాడివి అనితలచవచ్చు!
తరచి తరచి
కన్నులార్పక కాంచకు
దుమ్ముధూళీ పడవచ్చు
క్రిమికీటకాలు బాధించవచ్చు!
పదే పదే
తనువును తడుముకోకు
గజ్జివాడిగా చూడొచ్చు
గలీజోడుగా ముద్రవెయ్యొచ్చు!
మరలా మరలా
మాయకు లొంగబోకు
మత్తు బంధించవచ్చు
మోహం ముంచెత్తవచ్చు!
అరచి అరచి
విసిగి వేసారబోకు
అసహనం పుట్టవచ్చు
ఆహ్లాదం కరగిపోవచ్చు!
కోరి కోరి
పొగడ్తలు అడగబోకు
విలువ తగ్గవచ్చు
విలాసము కోల్పోవచ్చు!
మళ్ళీ మళ్ళీ
చెప్పిందే చెప్పబోకు
వింతమనిషిగా ఎంచవచ్చు
విడ్డూరంగా భావించవచ్చు!
రాసి రాసి
ముత్యాల్లాంటి పదాలుచల్లు
అందాలను ఆవిష్కరించు
ఆనందాలను పంచిపెట్టు!
కూర్చి కూర్చి
కవితాజల్లులు కురిపించు
మాధుర్యాలు విరజిమ్ము
మనసులను మురిపించు!
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment