ఉత్ప్రేక్షలు


ఆకాశం అంచులకు ఎత్తుతా -

నక్షత్రాలు పెక్కుటిని ఏరిస్తా,

పాతాళం లోతుల్లోకి దించుతా -

నవరత్నాలు సేకరించి తెమ్మంటా.


పలుకుల్లో తేనెను చిందిస్తా -

అధరాల్లో సుధను పారిస్తా,

మల్లెపూలు తలపై చల్లుతా -

మత్తులోకి మనసుని నెట్టుతా.


నవ్వులు గాలిలో విసురుతా -

పువ్వులు బోలెడు పూయిస్తా,

బొట్టులో చంద్రుని చూపుతా -

ముక్కుతో కోటేరుని కనమంటా.


కళ్ళతో సైగచేసి స్వాగతిస్తా -

కరాలతో మృదువుగా స్పృశిస్తా,

హంసను నడకతో తలపిస్తా -

కోకిలను గానముతో గుర్తుకుతెస్తా.


బుగ్గల్లో సిగ్గులు వెలువరిస్తా -

మోములో కాంతులు విరజిమ్ముతా,

చీరలో సింగారం చూపిస్తా -

మేనులో శృంగారం ఒలికిస్తా.


గాజులు గణగణమోగిస్తా -

గుండెలు ఝల్లుమనిపిస్తా,

గజ్జెలు ఘల్లుమనిపిస్తా -

మనసులు పులకరింపచేస్తా.


కలంతో వెలుగులు ప్రసరిస్తా -

పుటలపై ముత్యాలు పేర్చుతా,

ఉత్ప్రేక్షలతో హృదుల అలరిస్తా -

ఉపమానాలతో మదుల మురిపిస్తా.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog