పాఠకా! ప్రేరకా! (కవి ముద్ర)
కవితాశీర్షిక చూశావు
నామాటేనని గుర్తుపట్టావు
తొలివాక్యం చదివావు
నారసాత్మకం అనుకున్నావు
అక్షరాలను గమనించావు
నాముత్యాలని గ్రహించావు
పదాలను పఠించావు
నాలాలిత్యమేనని ఎరిగావు
అలొచనలను పట్టుకున్నావు
నాతపనను చవిచూశావు
భావాన్ని పసికట్టావు
నావెన్నెలను ఆస్వాదించావు
శైలిని కనుక్కున్నావు
నాసృష్టేనని ఆకళించుకున్నావు
తేటపదాలను గురుతుపట్టావు
నాపలుకులేనని ఆదరించావు
చిత్తాన్ని దోసుకుందనుకున్నావు
నాపనేనని తెలుసుకున్నావు
మనసును ముట్టిందనుకున్నావు
నాముద్రేనని కనుక్కొన్నావు
హృదిని మీటిందనుకున్నావు
నానామాన్ని స్మరించుకున్నావు
గుండెకు హత్తుకుందనుకున్నావు
నారచనేనని యాదికితెచ్చుకున్నావు
నిత్యం విడవక చదువుతున్నావు
నన్ను ఆకాశానికి ఎత్తుతున్నావు
రొజూ వ్యాఖ్యానం చేస్తున్నావు
నాపై ప్రశంసలవర్షం కురిపిస్తున్నావు
పాఠకోత్తములకు స్వాగతాంజలులు
ప్రతిస్పందనలకు బహుధన్యవాదాలు
ప్రోత్సాహానికి పలుప్రణామాలు
పరిచయానికి కడుకృతఙ్ఞతలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం
Comments
Post a Comment