కవిత్వం
అందమై అలరించాలి,
ఆనందాలు పంచిపెట్టాలి.
అతిమధురమై పొంగాలి,
ఆస్వాదింపజేసేలా ఉండాలి.
మేఘమై తేలిపోవాలి,
అమృతజల్లులు చిందించాలి.
సుతిమెత్తగా సాగిపోవాలి,
స్పర్శలా హృదయాన్నితాకాలి.
పువ్వై ప్రకాశించాలి,
పొంకాలతో రంజింపచేయాలి.
పరిమళమై వ్యాపించాలి,
పరిసరాల్ని పులకరింపచేయాలి.
నవ్వులై మురిపించాలి,
మోములపై వెలుగులునింపాలి.
పదాల్లో లయ ఉండాలి,
వీనులకు విందు ఇవ్వాలి.
పంక్తుల్లో పస పండాలి,
మదుల్లో కాపురం పెట్టాలి.
భావాల్లో లోతు ఉండాలి,
హృదుల్లో నిత్యం నిలవాలి.
జనాల చెంతకు చేరాలి,
మనసులను మేలుకొలపాలి.
చదువరులను అలరించాలి,
గుండెల్లో గూడుకట్టించాలి.
ఊహలకు రూపం అవ్వాలి,
మాటలకు చిత్రం కావాలి.
మదులకు అద్దం పట్టాలి,
హృదులకు స్వరమై పలకాలి.
— గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment