ఏమి చెయ్యను?
వెలుగు చెంతకొస్తుంది
చెలిమి చేస్తుంది
చక్కదనాలు చూపుతుంది
స్పందనలు తెలుపమంటుంది
గాలి చుట్టుముడుతుంది
తనువును తాకుతుంది
గుండెను ఆడిస్తుంది
లయబద్ధంగా వ్రాయమంటుంది
పువ్వులు ప్రక్కకొస్తున్నాయి
పరిమళం చల్లుతున్నాయి
పరవశపరుస్తున్నాయి
పెట్రేగిపొమ్మంటున్నాయి
పలుకులు పరుగునవస్తున్నాయి
పెదవులను ఆక్రమించుతున్నాయి
తేనెచుక్కలను చిమ్మమంటున్నాయి
సంతసాలను చేకూర్చమంటున్నాయి
అక్షరాలు అందుబాటులోకొస్తున్నాయి
పదాలపంక్తులుగా పేరుకుంటున్నాయి
కమ్మనివాక్యాలుగా కూడుకుంటున్నాయి
రసాత్మకమై రంజింపజేయమంటున్నాయి
తలపులు తడుతున్నాయి
విషయాలు వెలువడుతున్నాయి
నవరసాలను నింపమంటున్నాయి
సంతృప్తితో ముందుకుసాగమంటున్నాయి
కలము చేతిలోదూరుతుంది
గీతలను గీయమంటుంది
గానాలను పారించమంటుంది
గాంధర్వులను తలపించమంటుంది
కాగితాలు దగ్గరకొస్తున్నాయి
బల్లపై పరచుకుంటున్నాయి
భావాలను ఎక్కించమంటున్నాయి
భ్రమలను కొలుపమంటున్నాయి
డృశ్యాలు కళ్ళముందుకొస్తున్నాయి
శిల్పాలుగా చెక్కమంటున్నాయి
చిత్రాలుగా గీయమంటున్నాయి
మదులను మురిపించమంటున్నాయి
సృష్టికర్తనని తలబోస్తున్నారు
బొమ్మలు చేయమంటున్నారు
ప్రాణాలు పొయ్యమంటున్నారు
కమ్మదనాలు పంచమంటున్నారు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment