కవితా చప్పుళ్ళు


కవిత కనపడినపుడు

పత్రికను విసిరేయకు,

పుస్తకాన్ని దాచేయకు,

పఠనానందం విడువకు.


కవిత చదివేటపుడు

కవిహృదయాన్ని చూడు,

కవికష్టాన్ని కను,

కమ్మదనాన్ని క్రోలు.


కవిత పొగిడేటపుడు

ఆంతర్యాన్ని వెల్లడించు,

మాధుర్యాన్ని పంచిపెట్టు,

సుగంధాన్ని వెదజల్లు. 


కవిత వినేటపుడు

శ్రద్ధను చూపించు,

శ్రావ్యతను ఆస్వాదించు,

సంతసాన్ని చిందించు.


కవిత రాయాలనుకున్నప్పుడు

కవులతీరులు పరిశీలించు,

కొన్ని కవితలను పఠించు,

కొత్త రీతిలో వెలిబుచ్చు.


కవిత కూర్చేటపుడు

విషయాన్ని విశదీకరించు,

శిల్ప నైపుణ్యాన్ని ప్రదర్శించు,

ప్రాసలు పోలికలు ఉపయోగించు.


కవిత వెంటబడ్డపుడు

కసరటము చేయకు,

కలమును చేతపట్టు,

కాగితమును పూరించు


కవిత కుతూహలపరచినపుడు

కూర్చటము కొనసాగించు,

సృజనశక్తిని వినియోగించు,

కవితాయుక్తిని ప్రయోగించు.


కవిత కవ్వించినపుడు

చెంతకు తోడుగా వెళ్ళు,

చెలిమిని మెల్లగా సాగించు,

చేతులను కలుపుకొని నడువు. 


కవిత కోరినపుడు

తక్షణమే స్పందించు,

హృదయాన్ని అర్పించు,

కమ్మని కవనాన్ని అల్లు.


-- గుండ్లపల్లి రజేంద్రప్రసాద్, భాగ్యనగరం 

Comments

Popular posts from this blog