రాతల్లో
సోకులు
సున్నితంగా చూపుతా
మదులు
మెలమెల్లగా మీటుతా
అక్షరాలు
ఏరుకొని చల్లుతా
అనుభవాలు
కోరికోరి పంచుతా
పదాలు
పువ్వుల్లా కూరుస్తా
పాఠకులకు
పసందు కలిగిస్తా
పలుకులు
ప్రేమగా చిందుతా
తేనెచుక్కలు
తెమ్మరగా చల్లుతా
రాతలు
నిరంతరం సాగిస్తా
రసాలు
గటగటా త్రాగిస్తా
పాఠాలు
పదేపదే చెబుతా
గమ్యాలు
గబగబా చేరుస్తా
పువ్వులు
నిండుగా పూయిస్తా
పరిమళాలు
పరిసరాల్లో చిందిస్తా
నవ్వులు
మెండుగ కురిపిస్తా
మోములు
కళకళా వెలిగిస్తా
ప్రాసలు
పంక్తుల్లో పారిస్తా
పోలికలు
ఆకర్షణగా ప్రయోగిస్తా
ఊహలు
దండిగా ఊరిస్తా
భావాలు
ఘనంగా పారిస్తా
కలము
నిత్యమూ కదిలిస్తా
పుటలు
విరివిగా నింపేస్తా
కళ్ళు
పూర్తిగా తెరిపిస్తా
నిజాలు
నేరుగా ఎరిగిస్తా
నీతులు
టకటకా వల్లెవేస్తా
బతుకులు
బహుబాగా పండిస్తా
హృదులు
మెల్లగా కరిగిస్తా
గుండెలు
విధిగా మురిపిస్తా
రచనల్లో
రమ్యంగా నేనుంటా
రసాల్లోనే
నాయాత్ర సాగిస్తా
కవితల్లో
వెనుక నేనుంటా
కమ్మదనాల్లో
క్రమంగా ముంచేస్తా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment