ఓరి తుంటరోడా!


ఓరి తుంటరోడా!

లొంగుతామనుకున్నావా!

మాయమాటలతో

నొక్కివేయాలనుకున్నావా!


సుంకాల శృంఖాలతో

తలవంచుతామనుకున్నావా!

స్వేచ్చావాయువులను విడిచి

సంధికొస్తామనుకున్నావా!


బెదిరింపుల తూటాలకు

బెంబేలెత్తుతామనుకున్నావా!

దొంగమాటల మాయకు

దాసోహమంటామనుకున్నావా!


కారుకూతల నాటకాలకు

కంపించిపోతామనుకున్నావా!

కుళ్ళు రాజకీయాలముందు

కూలిపోతామనుకున్నావా!


ఉగ్రవాదుల చెడుమార్గాలను

ఉపేక్షిస్తామనుకున్నావా!

మతోన్మాద చర్యలను

ముట్టుకోలేమనుకున్నావా!


ఆంక్షల అల్లకల్లోలంలో

అల్లాడిపోతామనుకున్నావా!

అహంకారపు అగ్నికి

అణిగిమణుగుతామనుకున్నావా!


మాదేశమే మా దీపం,

స్వాతంత్ర్యమే మా ప్రాణం,

ప్రజాశ్రేయస్సే మా ధ్యేయం—

అదియే  మా మార్గదర్శనం.


మా నాయకుల నేతృత్వం

మాకు దిక్సూచి, ధైర్యం;

వారిని మేము గౌరవిస్తాం

గర్వంగా బలపరుస్తాం.


— గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog