కవితా!
తేనె చుక్కలా రా,
తేట పలుకులా రా.
చక్కని చిలుకలా రా,
తెల్లని తేజములా రా.
పూల దండలా రా,
వెండి మేఘంలా రా.
నీటి ప్రవాహంలా రా,
నోటి నినాదంలా రా.
కడలి కెరటంలా రా,
గాలి తరంగంలా రా.
ఆకాశ తారకల్లా రా,
ధరణి రత్నాల్లా రా.
అందాల ఆభరణంలా రా,
ఆనందాల అద్దాలసౌధంలా రా.
అమ్మ అనురాగంలా రా,
అయ్య అభిమానంలా రా.
ఆటల బొమ్మలా రా,
పాటల సొత్తులా రా.
పాల పొంగులా రా,
పదాల హంగులా రా.
వయ్యారి వధువులా రా,
తెల్లారి వెలుగులా రా.
మేటి మల్లియలా రా,
నిత్య నూతనంలా రా.
చెక్కిలి చిరునవ్వులా రా,
చల్లని చిరుజల్లులా రా.
చిన్నారి ముద్దుపలుకులా రా,
పసివాడి పసిడికాంతిలా రా.
మాటల మంత్రంలా రా,
చేతల చైతన్యంలా రా.
చెక్కిన శిల్పంలా రా,
గీచిన చిత్రంలా రా.
అక్షరాల ఆశలా రా,
మానసిక జ్యోతిలా రా.
పదాల సొంపులా రా,
వీనుల విందులా రా.
అమృత ధారలా రా,
సుమాల సౌరభంలా రా.
నిలిచిపోయే నాదంలా రా,
నిత్యముండే కవిత్వంలా రా.
-- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment