అంతా నీ ఇష్టం
చీకట్లో
మగ్గుతావో,
వెలుగుల్లో
మెరుస్తావో — నీ ఇష్టం.
ఓటమితో
కృంగిపోతావో,
గెలుపుకోసం
కృషిచేస్తావో — నీ ఇష్టం.
అజ్ఞానంలో
కునారిల్లుతావో,
విజ్ఞానంతో
వర్ధిల్లుతావో — నీ ఇష్టం.
పాపాలు
మూటకట్టుకుంటావో,
పుణ్యాలు
ప్రాప్తించుకుంటావో — నీ ఇష్టం.
పరువు
పోగొట్టుకుంటావో,
పేరు
తెచ్చుకుంటావో — నీ ఇష్టం.
గుడ్డిగా
అనుసరిస్తావో,
పారజూచి
ప్రవర్తిస్తావో — నీ ఇష్టం.
మనుజులను
బాధపెడతావో,
మనసులను
దోచుకుంటావో — నీ ఇష్టం.
పిచ్చిగా
జీవితం గడుపుతావో,
తెలివితో
మనుగడ సాగిస్తావో — నీ ఇష్టం.
అబద్ధాలు
చెబుతావో,
నిజాలు
వెల్లడిస్తావో — నీ ఇష్టం.
చేదును
పంచుతావో,
తీపిని
తినిపిస్తావో — నీ ఇష్టం.
ద్వేషము
రగిలిస్తావో,
ప్రేమను
పంచుతావో — నీ ఇష్టం.
చిగురించి
పచ్చబడతావో,
పండిపోయి
రాలిపోతావో — నీ ఇష్టం.
లేనివాటికి
వెంపర్లాడుతావో,
ఉన్నవాటితో
ఆనందిస్తావో — నీ ఇష్టం.
ఉత్తమాటలు
చెబుతావో,
గట్టి మార్గము
ఎన్నుకుంటావో — నీ ఇష్టం.
ముళ్ళబాటలో
నడుస్తావో -
పూలపథంలో
పయనిస్తావో - నీ ఇష్టం.
సొంతలాభము
కోరుకుంటావో -
సమాజశ్రేయస్సు
ఆశిస్తావో - నీ ఇష్టం.
నీ మనసే నీ అదృష్టం,
నీ చేతలే నీ ఐశ్వర్యం -
అంతా నీ ఇష్టం...
కానీ- నీ ఇష్టమే నీ భవిష్యత్తు -గుర్తించుకో.
నీ భవితవ్యం
నీ చేతుల్లోనే నిక్షిప్తం
నీ జీవితం
నీ నిర్ణయాల ప్రతిబింబం - గుర్తించుకో.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment