ఓ అక్షరాభిమాని!


అక్షరాలను

అరవిందాల్లా ఆవిష్కరించు

మనసులను మురిపించు


అక్షరాలను

తేనెచుక్కలుగా చేయి

నాల్కలకు చేర్పించు


అక్షరాలను

అమృతంగా పొంగించు

అధరాలకు అందించు


అక్షరాలను

అందంగా కూర్చు

ఆనందాలు పంచిపెట్టు


అక్షరాలను

గీతాలుగా అల్లు

శ్రావ్యంగా పాడించు


అక్షరాలను

విత్తనాలుగా నాటు

వటవృక్షాలుగా ఎదిగించు


అక్షరాలను

అర్ధవంతంగా ప్రయోగించు

అంతరంగాలను ఆకర్షించు


అక్షరాలను

అవనిపై కురిపించు

జీవనదిలా పారించు


అక్షరాలను

పంచభక్ష్యాలుగా తయారుచెయ్యి

కడుపులునింపి కుతూహలపరచు


అక్షరాలను

నవరసాలుగా మార్చెయ్యి

మనసులను మత్తెక్కించు


అక్షరాలను

కిరణాలుగా విసురు

అఙ్ఞానాంధకారలను పారద్రోలు


అక్షరాలను

అద్భుతంగా వాడు

వాగ్దేవికి ప్రీతిపాత్రుడవుకమ్ము


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog