అక్షరకుసుమాలు


అక్షరాలు

అందంగున్నాయి

ఆనందాలను

అందిస్తున్నాయి


అక్షరాలు

పువ్వుల్లా వికసిస్తున్నాయి

నవ్వులను

మోములపై వెదజల్లుతున్నాయి


అక్షరాల్లో

తేనె దాగున్నది

నోటిని

ఊరిస్తున్నది


అక్షరాలపై

సీతాకోకలు ఎగురుతున్నాయి

మాధుర్యాన్ని

మెల్లగా క్రోలుతున్నాయి


అక్షరాలు

తేనెచుక్కల్ని చల్లుతున్నాయి

మనసుని

మురిపించి మెరిపిస్తున్నాయి


అక్షరాలు

ముత్యాలు చల్లుతున్నాయి

సేకరించి

హారాన్ని గుచ్చమంటున్నాయి


అక్షరాలు

గుండెను తడుతున్నాయి

భావాలను

నెమ్మదిగా క్రక్కమంటున్నాయి


అక్షరాలు

ఆటలాడిస్తున్నాయి

స్వరాలను

పాటలై పాడిస్తున్నాయి


అక్షరాలు

అమృతాన్ని చిందిస్తున్నాయి

పెదాలను

తృప్తిగా తడిపేస్తున్నాయి


అక్షరాలు

మదుల్లో దూరుతున్నాయి

హృదులను

కరిగిస్తున్నాయి, మత్తెక్కిస్తున్నాయి


అక్షరాలు

నాటమంటున్నాయి

కవితాసేద్యము

కొనసాగించమంటున్నాయి


అక్షరాలు

వెంటపడుతున్నాయి

కవితాసౌరభాలు

వ్యాపించమంటున్నాయి


-- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog