చెట్ల గాధలు
చెట్లు — నాటినదీ చూశా,
పెంచినదీ చూశా,
కొట్టినదీ చూశా,
కాల్చినదీ చూశా.
చెట్లు — పూసి పరిమళించినవీ చూశా,
పొంకాలు చూపి మురిపించినవీ చూశా,
సౌరభాలు చల్లి సంతసపెట్టినవీ చూశా,
ప్రకృతిని పరవశింపజేసినవీ చూశా.
చెట్లు — కాయలతో తీపి పంచినవీ చూశా,
జీవితాలను పోషించినవీ చూశా,
తనువులను తృప్తిపరిచినవీ చూశా,
భూమికి బలం అందించినవీ చూశా.
చెట్లు — పలకరించి నీడనిచ్చినవీ చూశా,
చెంతకు పిలిచి చల్లదనమిచ్చినవీ చూశా,
చెలిమిగా నిలిచినవీ చూశా,
మానవునికి మిత్రులైనవీ చూశా.
చెట్లు — గాలిని ఆలింగనంచేసినవీ చూశా,
పక్షులకు గూళ్ళైనవీ చూశా,
పశువులకు మేతైనవీ చూశా,
జీవులకు ఆధారమైనవీ చూశా.
చెట్లు — మందులైనవీ చూశా,
రోగాలను తగ్గించినవీ చూశా,
దేవతలగా అయ్యినవీ చూశా,
పూజలను స్వీకరించినవీ చూశా.
చెట్లు — రాళ్లదెబ్బల తిన్నవీ చూశా,
గొడ్డళ్లతో నరికినవీ చూశా,
అరచి ఏడ్చినవీ చూశా,
కూలి నేలకొరిగినవీ చూశా.
చెట్లు — చిగురించీ పునర్జీవించినవీ చూశా,
పచ్చదనమై పులకరించినవీ చూశా,
వరదల్లో కాపాడినవీ చూశా,
వేడిగాలిలో ఆశ్రయమిచ్చినవీ చూశా.
చెట్లు — సావాసం నేర్పినవీ చూశా,
సేవల చేయమన్నవీ చూశా,
సమాజాన్ని వృద్ధిచేయమనినవీ చూశా,
సత్యంగా జీవించమనినవీ చూశా.
చెట్లు — కవులను కలంపట్టించినవీ చూశా,
ఆలోచనలను రేకెత్తించినవీ చూశా,
కవితలుగా మార్పించినవీ చూశా,
మనసుల్ని మెలిపెట్టినవీ చూశా.
చెట్లు — మౌనంగా మాట్లాడినవీ చూశా,
జీవనమూలం అయ్యినవీ చూశా,
మనసులని మృదువుచేసినవీ చూశా —
మానవుని మనిషినిచేసినవీ చూశా!
చెట్లు - త్యాగాలు చేసినవీ చూశా,
నరుల స్వార్ధాలను త్రుంచినవీ చూశా,
ప్రకృతిని పరిశుద్ధం చేసినవీ చూశా
పుడమికి ప్రసన్నత చేకూర్చినవీ చూశా
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment