చూపుల సింగారాలు


చూపులలో చక్కదనముంటుంది -

చూపరులను కట్టిపడవేస్తుంది,

కాంతులను విరజిమ్ముతుంది

హృదులను సంతసపరుస్తుంది.


చూపులలో మాటలుంటాయి —

చెప్పకుండానే పలుకుతాయి,

గుండెలలో నిండిన భావాలన్నీ

ఒక క్షణంలో వ్యక్తమవుతాయి.


నిశ్శబ్దాన్ని చీల్చేచూపులు,

నవ్వులకన్నా మధురమవుతాయి,

పలకరింపు లేకపోయినా

మనసులమధ్య సేతువులవుతాయి.


ఓ చూపు —

చిన్న గాలివానలా వస్తుంది,

మనసులోని కణాలను తాకి

వెలుగుల మేఘముగా మారుతుంది.


ఓ చూపు —

ముత్యపు బిందువై పడుతుంది,

కళ్ళలోనుంచి గుండెలలోకి జారుతుంది,

అమృతపు జలధారగా కురుస్తుంది.


మాటలు తడబడినపుడు,

చూపే భాషగామారుతుంది,

సంగతులు తట్టనపుడు,

చూపులే సందేశాలవుతాయి.


ఒక్కోచూపు కోపంలో కాంతులా దహిస్తుంది,

ప్రేమలో చల్లని వానలాగ తడుపుతుంది,

విషాదంలో గాఢమవుతుంది,

ఆనందంలో మెరుపులా మెరుస్తుంది.


కంటిచూపులు కొన్నిసార్లు గాయపరుస్తాయి,

కొన్నిసార్లు మాయమవుతాయి,

కానీ ఒకసారి కలిసిన చూపులు —

జీవితమంతా జ్ఞాపకాలవుతాయి.


మొదట చూచిన చూపే

కొత్త ప్రాణాన్నిస్తుంది,

నవ్వుల వెనుక ఆ చూపులలోనే

కథ మొదలవుతుంది.


చూపులే సాక్షిగా ప్రేమ పుట్టకొస్తుందీ,

మౌనమే జవాబుగా మాట మూగపోతుంది,

కానీ ఆ చూపులలోనే

జీవితం మొత్తం వెలిగిపోతుంది.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog