చూపుల బండారం
కంటి చూపుల్లో
తేడాలుంటాయి
అర్ధాలుంటాయి
భావాలుంటాయి
చక్కని చూపుల్లో
అందముంటుంది
ఆకర్షణవుంటుంది
ఆనందముంటుంది
టక్కరి చూపుల్లో
ఆంతర్యముంటుంది
మాయవుంటుంది
మర్మముంటుంది
సూటి చూపుల్లో
ప్రశ్నవుంటుంది
పరిశీలనుంటుంది
ప్రతిస్పందనుంటుంది
పక్క చూపుల్లో
వెదుకులాటుంటుంది
వెంపర్లాడటముంటుంది
వివిధమార్గాన్వేషణవుంటుంది
చిలిపి చూపుల్లో
రెచ్చకొట్టటముంటుంది
రమణీయతుంటుంది
రహస్యముంటుంది
కొంటె చూపుల్లో
కోరికవుంటుంది
కుతూహలముంటుంది
కమ్మదనముంటుంది
బెరుకు చూపుల్లో
బోల్తాకొట్టించాలనుంటుంది
బుట్టలోవేసుకోవాలనుంటుంది
బురిడీచేయాలనుంటుంది
దొంగ చూపుల్లో
దాపరికముంటుంది
దోచుకోవాలనుంటుంది
దుర్బుద్ధివుంటుంది
వంకర చూపుల్లో
వక్రబుద్ధివుంటుంది
వెన్నుపోటుదాగుంటుంది
వికృతమార్గముంటుంది
తొలి చూపుల్లో
తత్తరపాటుంటూంది
తొందరపాటుంటూంది
మొహమాటముంటుంది
కొన్ని చూపుల్లో
మాధుర్యాలుంటాయి
మాటలుంటాయి
మహత్యాలుంటాయి
విసిరిన చూపులు
చెబుతాయి స్వాగతం
సాగిస్తాయి సంభాషణం
చేకూరుస్తాయి సంతోషం
కలిసిన చూపులు
సాగిస్తాయి స్నేహాలు
అందిస్తాయి శుభాలు
చేకూరుస్తాయి సుఖాలు
విసిరిన చూపులకు చిక్కకండి
పన్నిన వలలకు దొరకకండి
చూపులతో నాటకాలు వదలండి
జీవితాలతో ఆటలు ఆడకండి
చూపులను సవివరంగా చదవండి
వెనుకనున్న చీకటిని గుర్తించండి
చూపుల్లో మర్మాలు తెలుసుకోండి
వెలుగులో నిజాలను ఆవిష్కరించండి
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment