మత్తుమాటల మహమ్మారి
తస్మాత్… తాగినోడు వస్తున్నాడు
తూగుతూ తుళ్ళుతూ –
రహదారికే వంపు పెట్టినట్టుగా
అడుగులు వేసుకుంటూ!
మత్తెక్కిన మాటలు – మంత్రాలట!
మత్తుదిగిన మాటలు – మహావాక్యాలట!
తొక్కతోలు మాటలు – తత్త్వమట!
బూతు మాటలు – బుద్ధిజీవుల భాషట!
“నేనే తోపు” అంటాడు,
తోచిన పలుకులను తూలుతాడు.
“నేనే తొండి” అంటాడు,
తెగిన బుద్ధికి బిరుదులు పెట్టుకుంటాడు.
చేయని ఇతరుల ఘనకార్యాలు
చెప్పుకుంటాడు తనవని,
చేసిన దుష్టకార్యాలనుండి
తప్పించుకుంటాడు తనవికాదని.
చిల్లర మాటలు చిధ్రాలై,
అల్లరి మాటలు వ్యర్థాలై –
వినేవాళ్ల చెవుల్లో
విసిరేసిన గులకరాళ్లై పడతాయి!
మిత్రుల్ని మిథ్యగా ముద్దాడి,
శత్రువుల్ని శ్లోకాలతో శపించి,
తన అజ్ఞానానికి
తానే పెద్ద పీఠం వేసుకుంటాడు.
ఇది మాటల మద్యం కాదు –
మద్యం మింగిన మాటల మహమ్మారి!
ఇది నవ్వుల వినోదం కాదు –
సమాజానికి సంక్రమించే వ్యాధి!
కాబట్టి వినండి పౌరులారా –
తాగినోడు చెప్పే తత్త్వం
తాగిన గ్లాసులోనే వదిలేయండి,
తాగిన నోటిలోనే మూసేయండి!
ఎందుకంటే…
స్పృహ లేని మాటలు సత్యం కావు,
సమాజానికి వెలుగుకాదు –
వాటికి దూరమే నిజమైన జాగ్రత్త!
గల్తీగాళ్ళను గమనించి
పారాహుషారుకాండి,
కల్తీగాళ్ళకు ఖబడ్దారుచెప్పి
జాగరూకతవహించండి.
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment