ముఖసంకేతాలు
ఒక్కోసారి మొహం ఎత్తుకుంటా —
మనసులోని నిజాయతీకి పతాకం ఎగరేస్తూ,
చూపుల్లో సత్యం మెరిపిస్తూ, అడుగుల్లో న్యాయం నడిపిస్తూ.
ఒక్కోమారు మొహం తిప్పుకుంటా —
అన్యాయపు ఆడంబరాల రభసలకు,
అబద్ధపు అరాచకాలకు సాక్షిభూతం కాకూడదనుకుంటూ.
ఒక్కోవేళ మొహం మాడ్చుకుంటా —
అహంకార జ్వాలకు కాలిన గర్వానికి
గుణపాఠం చెప్పాలని తలంచుతూ.
ఒక్కోక్షణాన మొహం వెలిగిస్తా —
మమత దీపంతో, మానవత్వ నూనెతో
మనుజుల హృదయాల్లో వెలుగులు నింపాలనుకుంటూ.
ఒక్కోనిమిషాన మొహం దించుకుంటా —
తప్పు తెలిసిన వేళ తలవంచి క్షమాపణ చెప్పి,
మళ్లీ మంచికి అడుగులేయాలని తలచుకుంటూ.
ఒక్కోసమయాన మొహం అలంకరించుకుంటా —
స్నేహపు చిరునవ్వులతో, స్నేహ సుగంధాలతో,
ప్రేమపూల పరిమళాలతో వ్యాపించాలనుకుంటూ.
ఒక్కోపొద్దు మొహం చిట్లిస్తా —
చీకటి కళ్లల్లో వెలుగులు నింపుతూ,
చెడుబుద్ధికి — చెడ్డ పనికి నిరసన ప్రకటిస్తూ.
ఎప్పుడైనా — మొహం మనసుకు సంకేతం,
మొహం హావభావాల ప్రకటనాస్థలం, అందచందాల ఆదిస్థానం.
మొహం పరిచయం, ప్రమాణం, మానవత్వం, ప్రతిరూపం.
— గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment