🌞 ఆదివారం వస్తే 🌞


ఆదివారం వస్తే ఉద్యోగస్తులకు

అలసిన శ్వాసకు విశ్రాంతి నిద్ర,

గడియారపు గండం నుంచి

మనసుకు లభించే ముక్తి.


ఆదివారం వస్తే ఇల్లాలుకు

నిత్యపనుల మధ్య

స్వల్ప స్వేచ్ఛ,

భర్తతో సంతోషంగా గడిపే అవకాశం.


ఆదివారం వస్తే విద్యార్థులకు

పుస్తకాల బరువు తగ్గి

ఆటల రెక్కలు విప్పి

ఆనందం ఆకాశం ఎగిరే వేళ.


ఆదివారం వస్తే చిరువ్యాపారస్తులకు

లాభనష్టాల లెక్కలతో పాటు

ఆశల అంచనాలు

రేపటి బాటకు సిద్ధం చేసే సమయం.


ఆదివారం వస్తే స్నేహితులకు

విడిపోయిన రోజుల్ని కలిపి

జ్ఞాపకాల జల్లులు కురిపించి

నవ్వుల విందు పంచే వేళ.


ఆదివారం వస్తే ప్రయాణికులకు

మార్గాల మాయలు

దూరాల సౌందర్యాలు

అనుభూతుల పుటలుగా మారే సమయం.


ఆదివారం వస్తే పత్రికలకు

వార్తలతో పాటు

విశ్లేషణల వెలుగు

పాఠక మేధస్సును తాకే రోజు.


ఆదివారం వస్తే లోకానికి

ఒక క్షణం ఆగి

జీవితాన్ని మళ్ళీ చూసుకునే

సామూహిక శ్వాస.


✍️ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.✍️



Comments

Popular posts from this blog