🌦️ జల్లుల జలతారు 🌦️
వాన జల్లులు
మట్టి గుండెల మీద ముద్దుపెడుతూ,
ఆకుల చెవుల్లో సంగీతం నింపుతూ,
ఆశల మొగ్గలు పూయించు జల్లులు.
తేనె జల్లులు
పువ్వుల పెదవులపై తళుకులీనుతూ,
తీపి మాటలకు పరిమళం పూయిస్తూ,
మనసుని మత్తెక్కించి మాధుర్యం పోసే జల్లులు.
నవ్వుల జల్లులు
చీకటి ముఖాలపై వెలుగు చిందిస్తూ,
బాధల బరువును తేలిక చేస్తూ,
హృదయానికి రెక్కలిచ్చి, ఆనందాకాశం ఎగరేసే జల్లులు.
పువ్వుల జల్లులు
వసంతానికి వర్ణాలు అద్దుతూ,
వీధుల్ని వాసనలతో నింపుతూ,
కమ్మదనం కలిగిస్తూ, ప్రకృతికి పండుగలు చేసే జల్లులు.
వెన్నెల జల్లులు
నిశ్శబ్ద రాత్రిలో నురుగు చిందిస్తూ,
మనసు గోడలపై వెలుగు గీస్తూ,
ఏకాంతానికి తోడు నిలిచి, వినోదపరచే జల్లులు.
ప్రేమ జల్లులు
చూపులలో చిగురించే సౌరభ్యమై,
స్పర్శలో స్నేహాన్ని జల్లుతూ,
హృదయాల మధ్య వంతెనై, జీవితానికే అర్థం చెప్పే జల్లులు.
ముత్యాల జల్లులు
కన్నీటి బొట్లలో కాంతులై మెరిసి,
వేదనకే విలువ నేర్పుతూ,
నిశ్శబ్ద బాధలకు భాషై, ధైర్యానికి అలంకారమయ్యే జల్లులు.
వరాల జల్లులు
దైవం చేతుల నుంచి జారిపడుతూ,
అభిలాషల ఆకాశం తాకిస్తూ,
అడుగడుగునా ఆశలు చల్లుతూ, జీవితానికే వెలుగు పంచే జల్లులు.
అక్షర జల్లులు
ఖాళీ కాగితంపై కురుస్తూ,
మౌనానికి మాటలు నేర్పుతూ,
ఆలోచనలకు ఆకారం ఇస్తూ, సాహిత్యానికి శ్వాసనిచ్చే జల్లులు.
కవితా జల్లులు
మనసు మేఘాల నుంచి జారుతూ,
హృదయ భూమిపై పల్లవి పూయిస్తూ,
భావాలకు బాణీలై, లోకాన్ని లోలకించే జల్లులు.
✍️ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.✍️

Comments
Post a Comment