🌅 సుప్రభాత వేళ 🌅
ప్రభాత వేళ
తొందరగా లేవాలనిపిస్తుంది,
నిద్ర ముసుగును తొలగించి
నూతనదినానికి స్వాగతం పలకాలనిపిస్తుంది.
ఉదయ వేళ
ఆలోచనలు పారించాలనిపిస్తుంది,
మనసు మేడల్లో దాగిన
మౌనమాలిన్యాన్ని కడగాలనిపిస్తుంది.
వేకువ వేళ
చుట్టూ చూడాలనిపిస్తుంది,
ఆకాశపు అంచుల్లో మెరిసే
వెలుగులను పుడమిపైకి దించాలనిపిస్తుంది.
ప్రాతః వేళ
కలం పట్టాలనిపిస్తుంది,
హృదయపు తళతళల్ని
అద్భుతమైన అక్షరాలుగా మలచాలనిపిస్తుంది.
ప్రత్యూష వేళ
కాగితాలు నింపాలనిపిస్తుంది,
కలల వర్ణాలతో
శ్వేతపుటలను సంబరపరచాలనిపిస్తుంది.
పొద్దుపొడుచు వేళ
కవితలు రాయాలనిపిస్తుంది,
నిశ్శబ్దానికీ స్వరం ఇచ్చి
నవజీవనరాగం వినిపించాలనిపిస్తుంది.
తెల్లవారు వేళ
మదులు దోచాలనిపిస్తుంది,
పదాల పరిమళాలతో
మనసుతోటలను పూయించాలనిపిస్తుంది.
తొలిసంజ వేళ
సాహిత్యలోకంలో వెలిగిపోవాలనిపిస్తుంది,
అక్షరామృతాన్ని సేవించి
అమరత్వం పొందాలనిపిస్తుంది. ✨
✍️ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.✍️

Comments
Post a Comment