అక్షరాల పరిమళం 


అక్షరాల్తో

తేనెచుక్కలు చల్లుతా —

జనుల నాలుకలపై

తీపిరుచులు పారిస్తా.


అక్షరాల్తో

వానచినుకులు కురిపిస్తా —

ఎండిన మనసుల నేలపై

ఆశల మొగ్గలు మొలకెత్తిస్తా.


అక్షరాల్తో

తలలోతలపులు పారిస్తా —

ఆలోచనల అంచుల్లో

భావాల నదులు ప్రవహింపజేస్తా.


అక్షరాల్తో

భావబండారాలను బయటపెడతా —

మౌనాల తాళాలు విప్పి

నిజాల్ని నుదిటిపై పెడతా.


అక్షరాల్తో

పువ్వులు పూయిస్తా —

పదాల పొదల్లో

పరిమళాల పండుగలు జరిపిస్తా.


అక్షరాల్తో

నవ్వులు చిందిస్తా —

చీకటి చెరువుల్లో

వెలుగుల కమలాలు వికసింపజేస్తా.


అక్షరాల్తో

సుమసౌరభాలు వ్యాపిస్తా —

సాహితీ గాలుల్లో

సుగంధాల వానలు కురిపిస్తా.


అక్షరాల్తో

తెలుగు వెలుగులు చిమ్ముతా —

పాఠకుల గుండెల్లో

మాతృభాష దీపాలు వెలిగిస్తా.


అక్షరాల్తో

తనువులు తడతా —

చల్లని వెన్నెలలో

హాయిగా విహరింపజేస్తా.


అక్షరాల్తో

మనసులు మీటుతా —

మౌనాల మధ్య

మధురమైన మాటలు వినిపిస్తా.


అక్షరాల్తో

కలము కదిలిస్తా —

నిద్రపోయిన కాలాన్ని

కవితలతో మేల్కొలుపుతా.


అక్షరాల్తో

కవితలు సృష్టిస్తా —

ఆశల ఆకాశంలో

కలల రెక్కలు కట్టిస్తా.


— గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog