మనసు ముచ్చట్లు


మనసు ఊరకుండదు,

మనసు ఊగుతుంటుంది,

చిన్న మాటకే చిగురిస్తుంది,

చిన్న చూపుకే చిందులేస్తుంది.


మనసు మౌనంగా నవ్వుతుంది,

మనసు మౌనంగా ఏడుస్తుంది,

లోపలే తుఫాన్లు దాచుకుంటుంది,

బయటికి ప్రశాంతంగా నటిస్తుంది.


మనసు ఊహలతో సౌధం కట్టుకుంటుంది,

మనసు ఆశలతో అలంకరించుకుంటుంది,

నిజాల గాలికి ఒరిగిపడి గాయపడుతుంది,

మళ్ళీ మళ్ళీ లేచి ముందుకు నడుస్తుంది.


మనసు మాటలు అడగదు,

మనసు కారణాలు చెప్పదు,

ఎప్పుడైనా ఎక్కడైనా ఆటలాడిస్తుంది,

ఎట్లైనా ఏమైనా తలవంచిస్తుంది.


మనసు దేవుడికన్నా గొప్పది,

మనసు దెయ్యంకన్నా భయంకరమైనది,

ఒక్క చిరునవ్వుతో స్వర్గం చూపిస్తుంది,

ఒక్క నిర్లక్ష్యంతో నరకం చూపిస్తుంది.


మనసు మన చేతుల్లో లేదు,

మనసు మన మాట వినదు,

మనల్నే బంధీలుగా పట్టుకుంటుంది,

కట్టుబానిసలుగా చేసుకుంటుంది.


మనసు మనిషికి మార్గదర్శకం,

మనసు దేహానికి మూలాంగం,

మనసు శరీరానికి ప్రాణాధారం,

మనసు కాయానికి జీవనకారకం.


మనసు ఆకారరహితం,

మనసు ఆలోచనలభరితం,

మనసు అంతర్లీనం,

మనసు అప్రతిహతం.


మనసుకు 

ముక్కుతాడు వేస్తావో, 

పగ్గమేసి పట్టుకుంటావో, 

దారికి తెచ్చుకుంటావో నీ ఇచ్ఛ. 


మనసును

మురిపించి మెరిపిస్తావో,

మత్తెక్కించి మూలనపెడతావో,

మభ్యపెట్టి మాయచేస్తావో నీ వాంఛ. 


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్,భాగ్యనగరం




Comments

Popular posts from this blog