🪔మాతా మూగాంబికా!🪔
పశ్చిమ కనుమల వనఛాయల్లో
పావన పరిమళాలు పొంగె,
కొల్లూరు గిరిపాదాల వద్ద
మౌనమే మంత్రంగా మ్రోగె.
నిశ్శబ్దాన్నే నాదం చేసి
కాంతుల కిరీటమై విరాజిల్లె,
శివశక్తుల సౌరభంతో
మాత మూగాంబిక వెలిచె.
అమ్మా మూగాంబికా… కరుణామయీ!
జ్ఞానశక్తి రూపిణీ… జగదంబికా!
అమ్మా మూగాంబికా… వరదాయినీ!
భక్తుల బాధలు తీర్చే జననీ!
కౌమారాసురుడు క్రూరుడై
కాలుడిలా లోకాన్ని వణికించె,
దేవతల కన్నీళ్లు ప్రార్థనలై
కైలాసాన్ని కదిలించె…
కరుణ కరిగిన పరమేశ్వరుడు
తేజస్సును ఏకం చేయగా,
శివశక్తులు ఆలింగనమై
అర్ధనారీశ్వరమై అవతరించె.
స్త్రీకాదు – పురుషుడుకాదు
సీమల్ని దాటిన తత్త్వమై,
రెండు శక్తుల సంగమమై
మధ్యమ స్వరూపమై విరాజిల్లె.
ఆ తేజోమూర్తి ఒక చూపుతో
రాక్షస బలాన్ని కూల్చె,
లోకాలు ఊపిరి పీల్చె,
శాంతి సౌరభం పొంగె.
ఆ తేజస్సే కొల్లూరులో
శక్తిపీఠమై ప్రతిఫలించె,
దేవతలు పూలవర్షం కురిపించగా
ఋషుల గానం మ్రోగె…
మూగాసురుడు మళ్లీ లేచి
దేవతలను వేధించగా,
కరుణాసాగరి దేవి అవతరించి
మూగుని మూగగానే మట్టిచేసె.
అందుకే లోకమంతా ఆమెను
మూగాంబికా అని పిలిచె,
మూగజీవులకూ మాటనిచ్చే
వాక్సిద్ధి వరదాయినిగా కొలిచె.
ఆనందావేశంలో ఋషులు
మౌనమై నిలిచిన క్షణాన,
ఆ మౌనమే నాదమై మారి
మహిమగా మలచుకునె.
ఆది శంకరుడు దర్శించి
శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించగా,
జ్ఞానారాధనకు దీపమై
కొల్లూరు క్షేత్రం వెలిగె.
నిష్కల రూపమై గర్భగృహంలో
నిరాకార తత్త్వమై వెలసె,
పక్కనే సరస్వతీ రూపమై
సర్వవిద్యల వరమిచ్చె.
విద్యకు వాక్కుకు వరాలకూ
మూగాంబికే అయ్యె మూలశక్తి,
భక్తుల హృదయాల గుడిలో
నిత్యదీపమై వెలుగుతుండె.
కొల్లూరు కొండల మధ్యనున్న అమ్మా!
నీ నామమే మాకు ప్రాణనాదం,
నీ కృపే మాకు కలల మార్గం,
నీ పాదాలే మాకు పరమసారం.
✍️ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.✍️
నిన్న కర్నాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా కొల్లూరులో వెలిసిన మాతా మూగాంబికా దేవి వార్లను దర్శనం చేసుకున్నాను. అమ్మవారి స్ఫూర్తితో ఈ పాట వ్రాశాను. మీరు చదివి ఆనందిస్తారని, మీకు మూగాంబికా దేవి కరుణా కటాక్షాలు లభించాలని ప్రార్దిస్తున్నాను.
Comments
Post a Comment