అక్షర నాటకం


అక్షరాలే రంగస్థలము,

అకారాదివర్ణాలే నటులు,

అక్కరాలే దర్శకులు,

అచ్చరాలే ప్రేక్షకులు.


కాగితం తెరలెత్తగానే

కాలం కాసేపు ఆగిపోతుంది,

కవి కలం నడిచిన దారిలో

కథ స్వయంగా నడుచుకుంటుంది.


వర్ణాలు వేషం మార్చుకుంటే

భావాలు పాత్రలవుతాయి,

పదాలు సంభాషణలై

మనసుల్ని పలికిస్తాయి.


ఒక అక్షరం నవ్వితే — హాస్యము,

ఓ అక్షరం కన్నీరు పెట్టితే — కారుణ్యము,

ఒకానొక అక్షరం ఉరిమితే — వీరత్వం,

ఒక్క అక్షరం మౌనంవహిస్తే — శాంతము.


చుక్కలే విరామాలై

ఉసురు తీసే నిశ్శబ్దాలు,

అర్థం దొరికేలోపే

కుదిపేస్తాయి మనసును.


ప్రేమ పాత్రలో అక్షరం

పువ్వులా పరిమళిస్తుంది,

వేదన పాత్రలో అదే అక్షరం

అగ్గిలా మండుతుంది.


సత్యం సాదాసీదా వేషంలో

వేదికపై నిలుస్తుంది,

అబద్ధం అలంకారాలతో

చప్పట్లకై పరుగెడుతుంది.


ప్రతి పంక్తి ఓ దృశ్యం,

ప్రతి దృశ్యం ఓ సందేశం,

చదివే ప్రతి  హృదయం- 

చివరి తీర్పు చెప్పే న్యాయస్థానం.


అక్షరాల తెరలెత్తగానే

హృదయం హాల్లో కూర్చుంటుంది,

భావాల లైట్లు వెలగగానే

మనసే నాట్యశాల అవుతుంది.


కేవలం రచయిత కాదు కవి,

అతనే నాటకానికి సూత్రధారి,

అక్షరాల నాడి పట్టుకుని-

భావనాట్యాన్ని నడిపే పాత్రధారి.


కాలం మారినా, కథనం మారినా,

పాత్రలు కొత్తవైనా,

అక్షర నాటకం ఎప్పుడూ -

నిత్య నూతనమే.


కవిత నా నాటకం,

మనసే దాని కథనం,

అక్షరాలే నిత్య నటులు —

ఇదే నా అక్షర నాటకము!


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.



Comments

Popular posts from this blog