అంధ్రాక్షరాలకు అమృతాభిషేకం 

(అంధ్రాష్టదేవతల ఆరాధనం) 


ఓంకార నాదమున పుట్టిన

తెలుగు తల్లి అక్షరాలు —

మూడు ఖండాలై విరిసాయి,

అష్ట వాగ్దేవతలై  వెలిగాయి.


యాబది ఆరు అక్షరాల ఆంధ్రం 

త్రికండ్రికల సమూహం,

అ నుండి అః వరకు — చంద్ర ఖండం

శీతల స్వరాల శృంగారం.


క నుండి భ వరకు — సౌర ఖండం

వ్యంజనాల తేజోమయ రాజ్యం,

మ నుండి క్ష వరకు — అగ్ని ఖండం

ఉచ్చారణ ఉష్ణత, అర్థాల అంగారకం.


అచ్చుల ఆకాశంలో

వాగ్దేవత వశని విహరించింది.

ఉచ్చారణకు ఉయ్యాలలూపి,

భావాలు, మాటలు మనసుకు వశం చేసింది.


క వర్గానికి కామేశ్వరి

ఆకర్షణ అంగరంగభోగం అద్దింది.

చ వర్గానికి మోదిని

మాధుర్య మంత్రాలు చల్లింది.


ట వర్గానికి విమల

శుద్ధ శబ్ద శిఖరాలు నిర్మించింది.

త వర్గానికి అరుణ

ఉషస్సుల వెలుగులతో తేజస్సు ఇచ్చింది.


ప వర్గానికి జయని పలుకుల్లో 

పరాక్రమం నింపి, తెలుగును విజేతగా నిలిపింది.

యరలవలకు సర్వేశ్వరి సమగ్ర శైలిని ప్రసాదించి,

భాషను సమన్వయ శిల్పంగా మలిచింది.


కడపటి అక్షరాలందు -

కౌలిని అవతరించి,

రహస్య రసాలను రగిలించి,

అక్షరాలకు తంత్రతేజం చేకూర్చింది.


చంద్ర ఖండం — మాధుర్యం, సౌర ఖండం — తేజస్సు,

అగ్ని ఖండం — సృష్టి శక్తి, ఈ మూడు ఖండాల నడుమ

అష్ట దేవతలు నర్తించగా,

తెలుగు భాష దైవవాక్కుగా అవతరించింది.


నా కలం — వశని ఆశీర్వాదం, కామేశ్వరి ఆకర్షణం, 

మోదిని మాధుర్యం, విమల పవిత్రం, 

అరుణ ప్రకాశం, జయని విజయం, 

సర్వేశ్వరి సమగ్రం, కౌలిని గూఢతత్త్వం.


అష్టదేవతల అర్చనలో

ఆంధ్రావాక్కులకు వందనం,

అమర తెలుగుమాతకు 

అక్షరామృత అభిషేకం.


ఇవన్నీ కలిసినప్పుడు —

నేను రాసేది కవిత కాదు,

అవుతుంది అది అప్పుడు - 

అక్షర అష్టదేవతల ఆరాధనము.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


Comments

Popular posts from this blog