అమ్మా భారతీ! 


అమ్మా వాగ్దేవీ! 

నీ ప్రియ పుత్రుడనమ్మా… నీ పరమ భక్తుడనమ్మా…

నిత్యమూ నిను పూజించెడి నాపై 

కరుణ చూపవమ్మా… కటాక్షించవమ్మా…


అజ్ఞానాంధకారంలో అలసిపోయిన 

నా అంతరంలో నీ జ్ఞానదీపం ఆర్పకమ్మా,

బోధల వెలుతురు ప్రసరించవమ్మా…

సుస్థిరమైన బుద్ధిని ప్రసాదించవమ్మా…


నా వాక్కులలో వంకరలు తొలగించి

నా పలుకులను శుద్ధి పరచవమ్మా,

అక్షరాల అరణ్యంలో అర్థాలపూలు పూయించవమ్మా,

భావాలపై తీయని తేనెచుక్కలు చల్లించవమ్మా…


నా అస్తవ్యస్తమైన ఆలోచనల్ని 

సరసమైన స్రవంతిగా మార్చవమ్మా,

భావాలకు బాటలువేసి శూన్యపుటలకు శ్వాస పోయవమ్మా,

సుందరమైన సుకవితలు వ్రాయించవమ్మా…


అమ్మా సరస్వతీ! 

నా అక్షరాలపై  నీ ప్రేమజల్లులు చల్లి,

నా వాక్కులపై నీ స్వరఝరులు పారించి ,

నా కవితలపై నీ సృజనాస్ఫూర్తులు సారించవమ్మా.


తల్లీ శారదాంబా! 

నా నాలుకపై ఆవహించి నర్తించవమ్మా,

నా కలంలో దూరి కదిలించవమ్మా,

నా హృదిలో నిలచి కాపురముండమ్మా…


— గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం


Comments

Popular posts from this blog