అక్షరాల ఆటలు


అక్షరవ్యూహాలు పన్నుతా,

భావాలను క్రమబద్ధంగా పేరుస్తా ,

ఆలోచనల సేనల్ని పిలుస్తా, 

సాహిత్య సమరం ప్రారంభిస్తా.


అక్షరయుద్ధాలు చేస్తా,

అజ్ఞానంతో పోరాడుతా,

సత్యబాణాలు వదులుతా,

హృదయాల లోతుల్లో గుచ్చుతా.


అక్షరగోడలు కట్టుతా,

వేదనలకు అడ్డం పెడతా,

స్వప్నాల ఇటుకలు వాడుతా,

సాహిత్య సామ్రాజ్యం సృష్టిస్తా.


అక్షరసౌధాలు నిర్మిస్తా,

కలలకు రూపం ఇస్తా,

సాహితీ శిల్పాలు చెక్కుతా,

వాగ్దేవిమందిరంలో పూజలు చేయిస్తా.


అక్షరజల్లులు చల్లుతా,

ఎండిన మనసులు తడిపేస్తా,

కవితా మేఘాల నుంచి ప్రేమను

ముత్యాల్లా కురిపిస్తా.


అక్షరసుధలు త్రాగిస్తా,

విషాదాల్ని తరిమేస్తా,

వేదనల తాపాన్ని చల్లార్చుతా, 

జీవితాలను నవరసభరితం చేస్తా.


అక్షరపువ్వులు పూయిస్తా,

హృదయవనాలు అలంకరిస్తా,

ప్రేమ పరిమళాలు వెదజల్లుతా, 

తేనెచుక్కలు చిందిస్తా .


అక్షరగంధాలు పారిస్తా,

దూరాల్ని దగ్గర చేస్తా,

విరహ గాలుల్లో సైతం

స్నేహ సౌరభాలు నింపుతా.


అక్షరదీపాలు వెలిగిస్తా,

చీకట్లను చీల్చేస్తా,

అజ్ఞానాంధకారాల్లో

ఆలోచనల వెలుగు పంచుతా.


అక్షరసేతువులు కట్టేస్తా ,

మనసుల మధ్య దూరాలపై,

వేదనల నదుల్ని దాటించి

విశ్వాస తీరాలకు చేర్చుతా.


అక్షరనౌకలు నడుపుతా,

కాలసముద్రాల అలలపై,

స్మృతుల సరుకులతో నిండిన

కవితా ప్రయాణం సాగిస్తా.


అక్షరగీతాలు పాడుతా,

ఘంటానాదాలు మోగిస్తా,

నిశ్శబ్ద హృదయాల గవాక్షాల్లో

ఆనంద సంగీతం నింపుతా.


అక్షరమంత్రాలు జపిస్తా,

కవితా యజ్ఞాలు చేస్తా,

సాహిత్యాగ్నిలో స్వార్థాల్ని

హోమం చేసి అర్పిస్తా.


అక్షరానందం పంచుతా,

కావ్యామృతం చిందిస్తా,

జన్మంతా కవితలతోనే

జీవితాన్ని గడిపేలాచేస్తా.

 

గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.

Comments

Popular posts from this blog