కవితావేశం


మబ్బులు కమ్ముకుంటే

చినుకులు రాలతాయో లేదో కానీ —

తలపులు తడితే

అక్షరాలు జల్లులై జాలువారుతాయి.


గాలి వీస్తే

చెట్లకొమ్మలు ఊగుతాయో లేదో కానీ —

మనసును తాకితే

భావాలు పరిమళాలై వ్యాపిస్తాయి.


వాన కురిస్తే

భూమి పచ్చబడుతుందో లేదో కానీ —

ఊహలు ఉప్పొంగితే

కవిత్వం ప్రవాహమై పారుతుంది.


మొగ్గలు తొడిగితే

పూలు పూస్తాయో లేదో కానీ —

ఆలోచనలు మొలిస్తే

అక్షరాల తోట పూస్తుంది.


నోరు తెరిస్తే

మాటలు జారుతాయో లేదో కానీ —

హృదయం తెరిస్తే

ప్రాసపదాలు పుట్టుకొస్తాయి.


రవి ఉదయిస్తే

లోకం వెలుగుతో నిండుతుందో లేదో కానీ —

కవి ఉదయిస్తే

సాహిత్య జగం కాంతిమయం అవుతుంది.


మబ్బులు ఆకాశంలో పుడతాయి —

కవితలు హృదయంలో పుడతాయి;

చినుకులు నేలను తడిపితే,

అక్షరాలు మనసులను తడిపేస్తాయి.


గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం

Comments

Popular posts from this blog