మాటల మంత్రము – భావాల వర్షం కవిత్వమంటే— కలల కాంతుల కంచుకం కట్టిన కళాత్మక స్వప్నం, రేఖల మధ్య రంగులు పలికించే రాగరంజితం॥ కవిత్వమంటే— లయల లాలిత్యంతో లయబద్ధంగా నడిచే గమనం, హృదయ తంతులపై హార్మోనిలా హోరెత్తే సంగీతం॥ కవిత్వమంటే— భావాల విజృంభణం, అంతరంగ ఆవిష్కరణం, నిశ్శబ్దానికే నాదమిచ్చే మధుర మౌన గానం॥ కవిత్వమంటే— చతురత చిలుకలెగిరే చమత్కార చైతన్యం, ఒక పదంలో ప్రపంచాన్ని ఓలలాడించే మాయాజాలం॥ కవిత్వమంటే— సృజన సుడిగుండంలో స్ఫూర్తి సుడులు తిరిగే కల్పనం, అక్షరాల అణువణువులో అనంతాన్ని ఆవిష్కరించే కవనం॥ కవిత్వమంటే— శోభాస్వరూపిణి, శ్రావ్య సింధు సౌందర్యం, చూసిన కళ్లకు చిలుకరించే చిలిపి చంద్రాతపం॥ కవిత్వమంటే— నవ్యత నీలిమలు నిండిన కొత్త ప్రకాశం, పాతపలుకుల్లో కొత్తపలుకుబడి నింపే నూతనప్రయాణం॥ కవిత్వమంటే— కవనాత్మక కాంతి, కవి హృదయ స్పందనం, ప్రపంచాన్ని ప్రేమతో పలకరించే పరిమళవర్షం॥ కవిత్వమంటే— మనసు ముత్యాల హారం, మాటల మంత్రము— భావాల వర్షం॥ కవిత్వమంటే— హృదయాలను తట్టి మేల్కొలిపే మంత్రం, మదులను ముట్టి మంత్రముగ్ధం చేసే మహత్త్వం॥ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.