Posts

Showing posts from March, 2022
Image
 ఎందరో మహానుభావులు ఎందరో మహానుభావులు కలంపట్టి కాగితాలమీద ఎందుకో కమ్మనికవితలు ఎక్కించారు ఎందరో మహానుభావులు ఆలోచనలలో మునిగి భావాలలో తేలి ఎందుకో అంతరంగాన్ని ఆవిష్కరించారు ఎందరో మహానుభావులు అక్షరాలను యేరి పదాలను పొసగి ఎందుకో అత్యుత్తమకవనాలను అందించారు ఎందరో మహానుభావులు అందాలను వర్ణిస్తు ఆనందాలను అందిస్తు ఎందుకో అద్భుతకయితలను అల్లేశారు ఎందరో మహానుభావులు చూచి లేచి కదిలి  విని రాసి అనుభవించి ఎందుకో అపరూపసుకవిత్వాన్ని కూర్చారు ఎందరో మహానుభావులు అమాయకంగానున్నవారిని నిద్రావస్థలోనున్నవారిని ఎందుకో తట్టిలేపి చక్కనిసాహిత్యాన్ని చదివిస్తున్నారు మహానుభావులకు వందనములు వారిరచనలకు ధన్యవాదములు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఎవరో? ఎవరో ఆకాశానికి నీలిరంగు వేసి ఎత్తుకు తీసుకెళ్ళి అందకుండా చేసి చక్కగా చూపించి కళ్ళకు కమ్మదనం ఇస్తున్నారు మనసుకు మోదము కలుగజేస్తున్నారు ఎవరో ఆకాశంలో చుక్కలు పెట్టి చక్కగా వెలిగించి ముగ్గులు వేసి రంగులు అద్ది అందాలు చూపిస్తున్నారు ఆనందం కలుగజేస్తున్నారు ఎవరో ఆకాశంలో మబ్బులు పుట్టించి గాలిలో తేలించి మెరుపులు చూపించి ఉరుములు వినిపించి వర్షపు జల్లులు కురిపిస్తున్నారు ఆహారపానీయాలు అందిస్తున్నారు ఎవరో ఆకాశంలో చంద్రుని సృష్టించి చల్లని గాలులు వీయించి వెన్నెల కురిపించి మనసులు దోచుకుని ముచ్చట పరచి సుఖాలు అందిస్తున్నారు కోరికలు కలిగిస్తున్నారు ఎవరో ఆకాశంలో సూర్యదీపం వెలిగించి తూర్పు పడమరల తిప్పించి ఉదయసాయంత్రాలు కలిగించి చీకట్లు తరిమి భయాలు పోగొట్టి దారులు చూపించి ఆశలు కలిగిస్తున్నారు అఙ్ఞానఅంధకారాన్ని పారదోలుతున్నారు ఎవరో ఆకాశంలో గాలిని వీయించి మేఘాలను తేలించి కడలిలో అలలు పుట్టించి పక్షుల ఎగిరించి చెట్లకొమ్మల ఊపించి మనసుల ఊగించి తుఫానులు గాలివానలు కలిగిస్తున్నారు ప్రాణుల గుండెలను అదరగొడుతున్నారు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఆమెకోసం (పూలసేవ) పువ్వా సంపంగిపువ్వా సుగంధాన్ని వెదజల్లి ఆమెను ఆకర్షించాలని నిన్ను నాచేతిలో పట్టుకొనినిలిచి ఆమెను నాచెంతకు తెచ్చుకోగలిగా పువ్వా రోజాపువ్వా ఆమెను పలకరించి నీఅందాన్ని చూపించి నాప్రేమను తెలపటానికి ఆమెచేతికందించా ఆనందపరిచా పువ్వా  మందారపువ్వా నిన్ను ఆమెజడలోతురిమి ఆమెను తృప్తిపరచి ఆమె అందాన్ని రెట్టింపుజేసి ఆమెను ఆనందలోకంలో విహరింపజేశా పువ్వా చామంతిపువ్వా నీప్రకాశంతో ఆమెమోము వెలిగిపోవాలని నీసుకుమారస్పర్శతో ఆమె పులకరించిపోవాలని నిన్ను ఆమెవంటికి తగిలించి ఆమెను ఆనందసాగరంలో ముంచేశా పువ్వా మల్లెపువ్వా నీపరిమళంతో ఆమెను పరవశింపజేయాలని నీమెత్తదనంతో ఆమెవంటికి హాయిచేకూర్చాలని నిన్ను మంచంపరుపుపై చల్లి ఆమెను ఆహ్వానించా ఆహ్లాదపరిచా పూలసేవలకు అభివందనాలు ప్రేయసిప్రేమకు ధన్యవాదాలు ప్రకృతిపురుషులబంధానికి అక్షరనీరాజనాలు గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 రాస్తూపోతా పోతూరాస్తా రాశా రాస్తున్నా రాస్తుంటా రాస్తూరాస్తూ  పోతా పోతూపోతూ రాస్తా ఆలోచనలు తడుతున్నంతవరకు భావాలు పుడుతున్నంతవరకు విషయాలు దొరుకుతున్నంతవరకు రాస్తూనే పోతా అక్షరాలు అందేవరకు పదాలు పారేవరకు కలము సాగేవరకు రాస్తూరాస్తూ పోతా కనుచూపు ఉన్నంతవరకు శరీరశక్తి కలిగున్నంతవరకు ప్రాణము నిలిచినంతవరకు పోతూనే రాస్తా అందాలు కనువిందుచేసేటంతవరకు ఆనందాలు కలుగుతున్నంతవరకు గుండె కొట్టుకునేటంతవరకు పోతూపోతూ రాస్తా కలలు కలుగుతున్నంతవరకు కవిత కవ్వించేటంతవరకు కల్పనలు తోచినంతవరకు కలాన్ని పడుతూనేయుంటా పూలు ప్రేరేపిస్తున్నంతవరకు ప్రేయసి ప్రేమనుచూపిస్తున్నంతవరకు ప్రకృతి పరవశింపజేస్తున్నంతవరకు కవితలు వెలువరిస్తూనేయుంటా కవులున్నంతవరకు తెలుగు నిలుస్తుంది తెలుగు సాగుతుంది తెలుగు వెలుగుతుంది తెలుగు బ్రతుకుతుంది కవులు పుడతారు కవితలు రాస్తారు కవులు జీవిస్తారు కవితలను జీవింపజేస్తారు కవులకు జేజేలు కొడదాం కవితలకు జేజేలు పలుకుదాం గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Image
 ఏల? భూమికున్న ఆకర్షణ కొంత ఆమె వశమైనట్లుంది లేకపోతే ఏల ఆమె నన్ను ఆకట్టుకొంటుంది సూదంటురాయికున్న శక్తి కొంత ఆమెకు వచ్చినట్లుంది లేకపోతే ఏల ఆమె నన్ను ఆకర్షిస్తుంది పూలకున్న తావి కొంత ఆమెను ఆశ్రయించినట్లుంది లేకపోతే తేటిలాగ ఏల ఆమె నన్ను దగ్గరకు పిలుస్తుంది కడలికున్న బలము కొంత ఆమెను చేరినట్లుంది లేకపోతే నదులను లాగుకున్నట్లు  నన్ను ఆమె ఎందుకు చెంతకు చేర్చుకుంటుంది ఆమె చూపులందు ఏదో మహత్యమున్నట్లుంది లేకపోతే  ఏల ఆమె నా మనసును కట్టిపడవేస్తుంది దేముడు ఆమెకు ఏదో వరమిచ్చినట్లుంది లేకపోతే ఏల ఆమె నా హృదయాన్ని హత్తుకుంటుంది అగుపించనటువంటి అంగబలము ఆమెకున్నట్లుంది లేకపోతే ఏల ఆమె నన్ను  అధీనములోకి తీసుకుంటుంది గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం