ఎవరో?
ఎవరో
ఆకాశానికి
నీలిరంగు వేసి
ఎత్తుకు తీసుకెళ్ళి
అందకుండా చేసి
చక్కగా చూపించి
కళ్ళకు కమ్మదనం ఇస్తున్నారు
మనసుకు మోదము కలుగజేస్తున్నారు
ఎవరో
ఆకాశంలో
చుక్కలు పెట్టి
చక్కగా వెలిగించి
ముగ్గులు వేసి
రంగులు అద్ది
అందాలు చూపిస్తున్నారు
ఆనందం కలుగజేస్తున్నారు
ఎవరో
ఆకాశంలో
మబ్బులు పుట్టించి
గాలిలో తేలించి
మెరుపులు చూపించి
ఉరుములు వినిపించి
వర్షపు జల్లులు కురిపిస్తున్నారు
ఆహారపానీయాలు అందిస్తున్నారు
ఎవరో
ఆకాశంలో
చంద్రుని సృష్టించి
చల్లని గాలులు వీయించి
వెన్నెల కురిపించి
మనసులు దోచుకుని
ముచ్చట పరచి
సుఖాలు అందిస్తున్నారు
కోరికలు కలిగిస్తున్నారు
ఎవరో
ఆకాశంలో
సూర్యదీపం వెలిగించి
తూర్పు పడమరల తిప్పించి
ఉదయసాయంత్రాలు కలిగించి
చీకట్లు తరిమి
భయాలు పోగొట్టి
దారులు చూపించి
ఆశలు కలిగిస్తున్నారు
అఙ్ఞానఅంధకారాన్ని పారదోలుతున్నారు
ఎవరో
ఆకాశంలో
గాలిని వీయించి
మేఘాలను తేలించి
కడలిలో అలలు పుట్టించి
పక్షుల ఎగిరించి
చెట్లకొమ్మల ఊపించి
మనసుల ఊగించి
తుఫానులు గాలివానలు కలిగిస్తున్నారు
ప్రాణుల గుండెలను అదరగొడుతున్నారు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment