ఆమెకోసం
(పూలసేవ)
పువ్వా
సంపంగిపువ్వా
సుగంధాన్ని వెదజల్లి
ఆమెను ఆకర్షించాలని
నిన్ను నాచేతిలో పట్టుకొనినిలిచి
ఆమెను నాచెంతకు తెచ్చుకోగలిగా
పువ్వా
రోజాపువ్వా
ఆమెను పలకరించి
నీఅందాన్ని చూపించి
నాప్రేమను తెలపటానికి
ఆమెచేతికందించా ఆనందపరిచా
పువ్వా
మందారపువ్వా
నిన్ను ఆమెజడలోతురిమి
ఆమెను తృప్తిపరచి
ఆమె అందాన్ని రెట్టింపుజేసి
ఆమెను ఆనందలోకంలో విహరింపజేశా
పువ్వా
చామంతిపువ్వా
నీప్రకాశంతో ఆమెమోము వెలిగిపోవాలని
నీసుకుమారస్పర్శతో ఆమె పులకరించిపోవాలని
నిన్ను ఆమెవంటికి తగిలించి
ఆమెను ఆనందసాగరంలో ముంచేశా
పువ్వా
మల్లెపువ్వా
నీపరిమళంతో ఆమెను పరవశింపజేయాలని
నీమెత్తదనంతో ఆమెవంటికి హాయిచేకూర్చాలని
నిన్ను మంచంపరుపుపై చల్లి
ఆమెను ఆహ్వానించా ఆహ్లాదపరిచా
పూలసేవలకు
అభివందనాలు
ప్రేయసిప్రేమకు
ధన్యవాదాలు
ప్రకృతిపురుషులబంధానికి
అక్షరనీరాజనాలు
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment