పువ్వా! ఏమివ్వనూ నీకేమివ్వనూ?
అందం కావాలన్నా
పువ్వు ప్రత్యక్షమయ్యింది
ఆనందం కావాలన్నా
మరోపువ్వు ముందుకొచ్చింది
పరిమళం కావాలన్నా
పువ్వు పరుగెత్తుకుంటూవచ్చింది
పరవశం కావాలన్నా
పకపకలాడుతున్నపువ్వు ప్రక్కకొచ్చింది
రంగులు కావాలన్నా
రమ్యమైనపూలు రయ్యిరయ్యిమనివచ్చాయి
షోకులు కావాలన్నా
సొగసైనపూలు సరసానికొచ్చాయి
నవ్వు కావాలన్నా
పువ్వువచ్చి పెదవులపైకూర్చుంది
మార్పు కావాలన్నా
మరోపువ్వు రూపముమార్చుకొనివచ్చింది
సుకుమారం కావాలన్నా
సుమాలు వంటిని చుట్టుముట్టాయి
సౌఖ్యం కావాలన్నా
సుమాలు పడకపైపరుచుకున్నాయి
నవ్యత కావాలన్నా
కొత్తపూలు కళ్ళముందుకొచ్చాయి
భవిత కావాలన్నా
భారీగాపూలొచ్చి పరచుకొని బాటనుచూపించాయి
అక్షరాలు కావాలన్నా
అలరులు అందుబాటులోకొచ్చాయి
అర్ధవంతమైనపదాలు కావాలన్నా
అల్లిన అందాలపూలమాలలు చెంతకొచ్చాయి
భావం కావాలన్నా
విరులు వరసలోనిలిచాయి
కవిత కావాలన్నా
కుసుమాలు కమ్మగా కూడివచ్చాయి
పువ్వా
ఏమివ్వనూ
నీకేమివ్వనూ
నీఋణమెలాతీర్చుకోనూ
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment