నా హృదయ గీతాలు
కోమలాంగికవితను నేకోరలేదు
నన్ను కయితలకన్యకే నమ్మివలచె
పిచ్చివాడ్నిచేసెకవిత ప్రేమపంచి
నన్ను సాహిత్యలోకాన నడవమనెను
పుష్పములనుతెచ్చి ప్రేయసికివ్వంగ
పెంచినానునేను పూలతోట
ముద్దుమల్లెలు మందారములునుపూచె
ముద్దబంతులు విప్పారి మోదమిచ్చె
సన్నజాజిపూచె చామంతివిరబూచె
పూచె పలుగులాబిపూలు నచట
కబురుపంపినట్టి కాంతవచ్చుననుచు
పూలతోటనందు పొంచియుంటి
మచ్చెకంటితోడ మాటలాడదలచి
కాచుకోనియుంటి కలికికొరకు
సంతసంబుగూర్చ సరసాలునేర్చితి
వెలదిరాకకొరకు వేచియుంటి
ప్రక్కనున్నవారి పకపకలాడించ
పెక్కుచతురతులను పేర్చినాను
సంతసాల నేను సమకూర్చతలపుతో
షోకులాడికొరకు చూస్తుయుంటి
అధరసుధలను క్రోలంగ నాశకలిగి
సుదతివచ్చుననుచు నేను చూచుచుంటి
ప్రియురాలపిలచి ప్రేమను తెలుపంగ
ఫల్యగుచ్ఛములను పట్టియుంటి
గుండెతలుపుతెరచి గుబులునుతీర్చంగ
కలికికొరకు నేను కాచుకుంటి
అక్షరాలుపేర్చి నర్ధంబులివ్వంగ
కవిత వ్రాయుచుంటి కలముపట్టి
పదములెల్లకూర్చి పారించవలెనని
కదముతొక్కుచుంటి కవితవ్రాయ
గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
Comments
Post a Comment